కొంతమంది మగవాళ్ళకి… ఆడవాళ్ళలాంటి శరీర నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆ పురుషులలో రొమ్ములు పెరిగినట్టు కనిపిస్తాయి. ఇలా పురుషుల్లో రొమ్ములు పెరగడాన్ని గైనకోమాస్టియా అని పిలుస్తారు. ఇది ఒక సమస్యగానే చెప్పుకుంటారు. గ్రీకు భాష నుండి ఉద్భవించిన పదం. ఇది ఎక్కువగా ఊబకాయంతో బాధపడే వారిలో ఈ గైనకోమాస్టియా సమస్య కనిపిస్తూ ఉంటుంది.
గైనకో మాస్టియా ఎందుకు వస్తుంది?
గైనకోమాస్టియా 40 శాతం నుంచి 60 శాతం మంది పురుషుల్లో ఎందుకు వస్తుందో ప్రత్యేక కారణం లేదు. శరీరంలోని హార్మోన్ల మార్పులు వల్ల, టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల కూడా గైనకోమాస్టియా సమస్య కనిపిస్తుంది. అంటే వారిలో రొమ్ములు పెరగడం మొదలవుతుంది. అలాగే థైరాయిడ్ సరిగా పనిచేయకపోయినా, పిట్యూటరీ గ్రంధి పనిచేయకపోయినా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాలేయం మూత్రపిండాల రుగ్మతలతో బాధపడుతున్న వారు జన్యుపరమైన వ్యాధులు ఉన్నవారిలో కూడా ఇలా రొమ్ములు పెరిగే సమస్య ఉంటుంది.
మనిషి జీవితంలో రొమ్ముల అభివృద్ధి అనేది మూడు దిశలుగా ఉంటుంది. పురుషుల్లో యుక్త వయస్సులో కనిపించే రొమ్ముల పెరుగుదల హార్మోన్ల మార్పుల వల్ల కావచ్చు. హార్మోన్ల మార్పులు జరిగి రొమ్ములు పెరిగితే దానికి గైనకోమాస్టియనే కారణం. దీనికి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి.
రొమ్ములు పెరగడం వల్ల పురుషులకు సమాజం నుంచి హేళనలు వినిపిస్తాయి. పలుచటి షర్టు వేసుకుంటే చూసేందుకు అభ్యంతరకరంగా శరీరం ఉంటుంది. దీనివల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. స్నేహితులతో కలిసి జీవించలేరు. నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు కూడా రొమ్ములను అందరూ ప్రత్యేకంగా చూడడం వంటి సందర్భాలు ఎదురవుతాయి. ఇవన్నీ ఆ వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తాయి.
గైనకోమాస్టియా సమస్య వల్ల అవమానాలు ఎదురవుతూ ఉంటే ప్లాస్టిక్ సర్జన్ ని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోండి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయడం ద్వారా అది గైనకోమాస్టియా అవునా? కాదా? అనేది తెలుసుకుంటారు. అలాగే హార్మోన్ల పరీక్షలను కూడా చేసి హార్మోన్లలో ఎలాంటి మార్పులు వచ్చాయో గుర్తిస్తారు.
పెరిగిన రొమ్ములను మందుల ద్వారా తగ్గించడానికి వీలుకాదు. కాబట్టి శస్త్ర చికిత్స ద్వారానే వాటిని తగ్గిస్తారు. లైపోసెక్షన్ లేదా కొవ్వు తొలగింపు పద్ధతి ద్వారా ఆపరేషన్ చేస్తారు. దీనికి చిన్నగా కోత పెడతారు. సర్జరీ అయ్యాక కూడా ఆ ప్రాంతంలో ఎలాంటి మచ్చలు పడకుండానే జాగ్రత్తగా సర్జరీని పూర్తి చేస్తారు. కాబట్టి మీరు ఇలాంటి సమస్యతో బాధపడితే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోండి.
గైనకోమాస్ట్రియా కోసం చికిత్స తీసుకున్నాక కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. శస్త్ర చికిత్స చేశాక కూడా తిరిగి రొమ్ములు పెరిగే అవకాశం చాలా తక్కువ. ఆల్కహాల్ వినియోగం వంటివి మానేయడం చాలా ఉత్తమం.
Also Read: ఈ చిన్న సమస్య తీవ్రమైతే బ్రెయిన్ ట్యూమర్‌కు కారణం అవుతుందా?
గమనిక: ఈ వివరాలను మీకు కేవలం అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది చికిత్స లేదా వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా.. తప్పకుండా వైద్యులను సంప్రదించాలని మనవి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ లైవ్’ బాధ్యత వహించదని గమనించగలరు.