Spinach for hair: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చర్మం, జుట్టు మెరిసిపోతాయి. అయితే పాలకూరను కేవలం తినడం ద్వారానే కాదు జుట్టుకు అప్లై చేయడం ద్వారా కూడా ఎన్నో లాభాలను పొందవచ్చు.
శీతాకాలంలోనే పాలకూర అధికంగా దొరుకుతుంది. పాలకూరలో ఉండే పోషకాలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి అత్యవసరమైనవే. కేవలం పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారానే కాదు జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా ఎన్నో లాభాలను పొందవచ్చు. ఖరీదైన జుట్టు ఉత్పత్తులను వాడే కన్నా పాలకూరతో మీ జుట్టును వేగంగా పెంచుకోవచ్చు.
పాలకూర ఎలా సహాయపడుతుంది?
ఆకుపచ్చని పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, ప్రోటీన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టును మూలాల నుండి బలోపేతం చేస్తాయి. జుట్టు పొడవుగా పెరగడానికి సహకరిస్తాయి. పాలకూర జుట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. దీనిలో జింక్, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా మారుస్తాయి. ఎప్పుడైతే జింక్, మెగ్నీషియం వంటివి లోపిస్తాయో అప్పుడు జుట్టు రాలిపోతూ ఉంటుంది. కాబట్టి పాలకూరను తినడం ద్వారా, అలాగే జుట్టుకు అప్లై చేయడం వల్ల మీరు జుట్టును ఆరోగ్యంగా పెంచుకోవచ్చు.
హెయిర్ మాస్క్ తయారీ
పాలకూరతో హెయిర్ మాస్క్ ను తయారు చేసి వారానికి ఒకసారైనా జుట్టుకు అప్లై చేస్తే మంచిది. దీని వల్ల వెంట్రుకలు బలంగా మారి మెరుపును పొందుతాయి. పాలకూర హెయిర్ మాస్క్ ను తయారు చేసేందుకు ఒక కప్పు పాలకూర ఆకులను తీసుకోండి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బండి. దీన్ని ఒక గిన్నెలో వేయండి. అందులో పెరుగు, నూనె కలిపి మెత్తని పేస్టులా చేసుకోండి. ఈ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయండి. మాడుకు తగిలేలా ఈ మాస్క్ ను తలకు రాసుకోవాలి. అరగంట పాటు అలా వదిలేసి సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ హెయిర్ మాస్కు మన జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. వెంట్రుకలను బలంగా మారుస్తుంది. జుట్టు అతిగా రాలిపోతున్న వారికి పాలకూర హెయిర్ మాస్కు అద్భుతంగా పనిచేస్తుంది.
పాలకూరలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. ముఖ్యంగా మహిళలు కచ్చితంగా వారానికి ఒకసారైనా పాలకూరను తినేందుకు ప్రయత్నించాలి. పాలకూరలో ఉండే ఐరన్ ఆడవారిలో రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా పాలకూర తింటే వారికి కావాల్సిన ఫోలేట్ అందుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఈ ఆకుకూర ఎంతో సాయపడుతుంది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ ఆకుకూరకు దూరంగా ఉంటే మంచిది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను మరింతగా పెంచుతుంది.