మందార పువ్వు చూడటానికి ఎంత అందంగా ఉంటుందో… అన్ని ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. మందార పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మందార టీని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. దీనివల్ల శరీరం గ్లూకోజ్ ను వినియోగించుకునే శక్తి కూడా మెరుగుపడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మందార పూలతో చేసిన టీని లేదా కషాయాన్ని తాగడం వల్ల డయాబెటిస్ లక్షణాలను తగ్గించుకోవచ్చు.
మందార పూల టీతో ఉపయోగాలు
మందార పూలతో చేసిన టీ ని తాగడం వల్ల శరీరం నుండి విషాలను, వ్యర్థాలను తొలగించుకోవచ్చు. జీవక్రియను మెరుగుపరచుకోవచ్చు. డయాబెటిస్ తో బాధపడేవారు మందార పూలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రీ డయాబెటిస్ ఉన్నవారు మందార పూల టీని ప్రతిరోజు తాగడం వల్ల డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. రక్తంలో చక్కెరను సమతుల్యంగా ఉంచడంలో మందారపువ్వు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.
చక్కెర స్థాయిలు నియంత్రణలో
మందార పువ్వులో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఇక డయాబెటిస్‌కు ప్రధాన కారణం ఆక్సీకరణ ఒత్తిడి. ఈ ఒత్తిడి నుండి శరీరకణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు మందార పువ్వులో అధికంగా ఉంటాయి. మందార పూల టీని ప్రతిరోజూ తాగడం వల్ల బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. బరువు పెరగడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. ఎప్పుడైతే మీరు మందార పూల టీని ప్రతిరోజూ తాగుతారో జీవక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల బరువు త్వరగా తగ్గుతారు.
చెడుకొలెస్ట్రాల్ కరిగిపోయి
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రతిరోజు మందార పూల టీ తాగే వారికి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి మందార పూలు ఉపయోగపడతాయి. మందార పూల వినియోగం అనేది శరీరాన్ని విష వ్యర్ధాలనుండి కాపాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకుంటాయి.
రక్తపోటు తగ్గుతుంది
మందార పూల టీ ప్రతిరోజూ తాగేవారికి రక్తపోటు అదుపులో ఉంటుంది. హైబీపీ బాధపడుతున్నవారు ప్రతిరోజూ ఒక కప్పు మందార టీ తాగితే ఎంతో మంచిది. ఈ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎన్నో వైరస్ ల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. చర్మఆరోగ్యానికి ఇది ఎంతో సహకరిస్తుంది. మరణించిన చర్మకణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అయితే మందార పూల టీని మరీ అధికంగా తాగకూడదు. రోజుకు ఒక కప్పు తాగితే సరిపోతుంది. లేకుంటే కడుపునొప్పి, గ్యాస్ట్రిక సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తాయి. అలాగే ఏవైనా ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నవారు కూడా మందార టీకి దూరంగా ఉంటేనే మంచిది.