Homemade Face Pack: సహజత్వమే నిజమైన అందం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం ఎంతో ఖరీదైన క్రీమ్స్, లోషన్స్, సీరమ్స్ వాడుతుంటారు. కానీ ఇవన్నీ కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి, ఆ తర్వాత చర్మం కాంతి కోల్పోతుంది, పొడిబారిపోతుంది. ఎందుకంటే వాటిలో ఉన్న రసాయనాలు మన చర్మానికి మెల్లగా హాని చేస్తాయి. కానీ మన పాత సంప్రదాయ పద్ధతులు, సహజ పదార్థాలతో తయారు చేసే ఫేస్ ప్యాక్‌లు మాత్రం ఎలాంటి హాని లేకుండా, చర్మాన్ని లోతుగా పోషణను ఇస్తాయి.
బియ్యపు పిండితో ఇలా చేయండి
ముఖానికి సహజ కాంతిని, నిగారింపును ఇవ్వాలంటే మొదట చర్మాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పాలు, బియ్యప్పిండి, తేనె ఇవి కలిపి ఒక చిన్న మిశ్రమం తయారు చేసుకోవాలి. దాన్ని ముఖానికి పట్టించి కొన్ని నిమిషాల తర్వాత తుడిచేస్తే చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది. పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా చేస్తుంది. బియ్యప్పిండి సహజంగా చర్మాన్ని తెల్లగా మార్చి కాంతిని ఇస్తుంది. తేనె చర్మానికి సహజ తేమను అందిస్తుంది. ఈ ప్రక్రియతో చర్మం శుభ్రంగా మారుతుంది.
ఫేస్ పై స్క్రైబ్ చేయడం అవసరం
తర్వాత చర్మంలోని మృతకణాలను తొలగించడానికి స్క్రబ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె, చక్కెర, పచ్చిపసుపు, పెరుగు తీసుకుని బాగా కలిపి మూడు నుండి ఐదు నిమిషాల పాటు ముఖంపై మృదువుగా రుద్దాలి. చక్కెర చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పసుపు చర్మానికి ప్రకాశాన్ని ఇస్తూ మలినాలను తొలగిస్తుంది. పెరుగు చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ముఖానికి ఆవిరి
ఇప్పుడు ముఖానికి ఆవిరి పట్టించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఆవిరి వల్ల చర్మంలోని రంధ్రాలు తెరుచుకుంటాయి. లోపల ఉన్న మురికి, దుమ్ము బయటకు వస్తాయి. ఇది చర్మాన్ని లోపలినుంచి శుభ్రం చేస్తుంది.
మాస్క్ వేసుకోవాలి
ఇప్పుడు మాస్క్ వేసుకోవాలి. టమాటా రసం, పుదీనా గుజ్జు, ముల్తాని మట్టి తీసుకుని బాగా కలిపి ఒక మృదువైన పేస్ట్‌లా చేయాలి. దాన్ని ముఖానికి సమానంగా పట్టించి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. టమాటాలో ఉండే లైకోపీన్ చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. పుదీనా చల్లదనం ఇచ్చి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముల్తాని మట్టి చర్మంలో ఉన్న అదనపు నూనెను పీల్చి మృదువైన తాకిడి ఇస్తుంది.
వారానికి రెండు సార్లు చాలు
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ సహజ పద్ధతిని పాటిస్తే చర్మం సహజంగా మెరిసిపోతుంది. ముఖం మీద ఉండే మచ్చలు, నల్లటి మరకలు తగ్గిపోతాయి. చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఖరీదైన కాస్మొటిక్స్ లేదా లోషన్స్ అవసరం లేకుండా ఇంట్లోనే అందాన్ని కాపాడుకోవచ్చు.
నిజమైన అందం మీసొంతం
సహజత్వం అంటే కేవలం అందం కాదు, అది ఆరోగ్యానికి సంకేతం కూడా. రసాయన పదార్థాల కంటే సహజ పదార్థాలు ఎప్పుడూ మంచివే. మన అమ్మమ్మలు, నాయనమ్మలు వాడిన పద్ధతులు ఇప్పటికీ ఫలితం చూపిస్తున్నాయి. కాబట్టి సహజమైన పదార్థాలతో ఫేస్ కేర్ చేసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సహజత్వాన్ని ఆచరిస్తేనే అందం నిజమైన అర్థంలో వెలుగుతుంది.