Healthy Food for Children: చిన్న పిల్లల ఆరోగ్యానికి విటమిన్లు ఎంత అవసరమో చెప్పడం కంటే అనుభవించడం ముఖ్యం. పిల్లల శరీరంలోని ప్రతి కణం ఎదగడానికి, ఎముకలు బలపడడానికి, మానసికంగా చురుగ్గా ఉండడానికి విటమిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చిన్న వయసులోనే సరైన పోషకాహారం అందకపోతే వారు భవిష్యత్తులో రోగనిరోధక శక్తి కోల్పోతారు, అలసటగా, బలహీనంగా మారతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల ఆహారంలో తప్పనిసరిగా అవసరమైన విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.
విటమిన్-ఎ అత్యంత ప్రాధాన్యం
పిల్లల ఎదుగుదలలో విటమిన్-ఎ అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండడానికి తోడ్పడుతుంది. విటమిన్ ఎ సరిపడా లేకపోతే రాత్రిపూట చూపు తగ్గడం, చర్మం పొడిబారడం, ఆకలి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. క్యారెట్లు, చీజ్, పాలు, గుడ్లు, వెన్న వంటి ఆహార పదార్థాలలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.
శక్తిని అందించేది విటమిన్-బి
అలాగే పిల్లల శరీరానికి శక్తిని అందించేది విటమిన్-బి సమూహం. ఇది నరాల వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయాలంటే బి విటమిన్ అవసరం. దీని కొరత ఉంటే పిల్లలకు అలసట, చిరాకు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విటమిన్ మాంసం, చేపలు, సోయా, బీన్స్, పప్పులు, గోధుమలు, పచ్చి బియ్యంలో లభిస్తుంది.
Also Read: iQOO 15 Smartphone: నవంబర్‌లో భారత మార్కెట్లో అడుగు పెట్టనున్న ఐక్యూ 15.. డేట్ ఎప్పుడంటే?
చర్మ కాంతికి విటమిన్-సి
విటమిన్-సి పిల్లల శారీరక దృఢత్వానికి, చర్మ కాంతికి ఎంతో అవసరం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న వ్యాధుల నుంచి రక్షిస్తుంది. పుల్లని పండ్లు, టమాటాలు, తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా విటమిన్ సి లభిస్తుంది. పిల్లలు ప్రతిరోజూ ఒక మామిడి, నిమ్మరసం లేదా ముసంబి రసం వంటి పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.
సూర్యకాంతికి పిల్లలను బయట ఆడనివ్వడం
ఎముకలు బలంగా ఉండడానికి విటమిన్-డి అవసరం. ఈ విటమిన్ శరీరంలో కాల్షియం శోషణకు దోహదం చేస్తుంది. సూర్యరశ్మి ద్వారా కూడా ఇది శరీరానికి లభిస్తుంది. ఉదయం వేళ సూర్యకాంతి పడేలా పిల్లలను బయట ఆడనివ్వడం చాలా మంచిది. అలాగే పాలు, వెన్న, చేపల నూనెలు, గుడ్లు తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ డి అందుతుంది.
పిల్లలకు ఆకుకూరలు చాలా అవసరం
రక్తం తయారయ్యేందుకు ఇనుము చాలా అవసరం. ఇది శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇనుము కొరత ఉంటే పిల్లలు బలహీనంగా, డల్‌గా కనిపిస్తారు. పాలకూర, ఎండు ద్రాక్ష, బీన్స్, మినప్పప్పు, ఆకుకూరలు తినడం ద్వారా ఇనుము లభిస్తుంది. ప్రతిరోజూ పచ్చి ఆహారాలు, తాజా పదార్థాలు, సూర్యరశ్మి అన్నీ ఉంటేనే పిల్లల ఎదుగుదల సహజంగా జరుగుతుంది. ఈ పోషకాహారం పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు బాట చూపుతుంది.