ఒకప్పుడు ఓపికగా నీళ్లు మరగబెట్టి, పాలు కాచి, టీ పొడి వేసి పంచదార వేసి వేడివేడిగా టీ తాగేవారు. కానీ ఇప్పుడు అందరూ స్మార్ట్ అయిపోయారు. ఎక్కువగా కష్టపడకుండా సులువుగా వేడి వేడి నీళ్లలో ఒక టీ బ్యాగ్ ను, చిటికెడు పంచదారను వేసి టీ తాగేస్తున్నారు. కానీ ఆ టీ బ్యాగులు వాడడం ఎంతో ప్రమాదకరమని కొత్త అధ్యయనం చెబుతోంది. మీరు టీ బ్యాగ్ వేసుకున్న టీని తాగుతుంటే ప్లాస్టిక్ ను తింటున్నట్టే లెక్క అని ఈ కొత్త పరిశోధన వివరిస్తోంది.
మైక్రో ప్లాస్టిక్‌లు, నానో ప్లాస్టిక్‌ల గురించి మీరు వినే ఉంటారు. ఇవి మన కంటికి కనబడవు. మనకు గాలి ద్వారా కూడా ముక్కులోంచి శ్వాసనాళంలోకి చేరిపోవచ్చు. అంత సూక్ష్మంగా ఉంటాయి. అలాంటి మైక్రో ప్లాస్టిక్‌లు, నానో ప్లాస్టిక్‌లు టీ బ్యాగుల్లో వేలకొద్దీ ఉండే అవకాశం ఉందని అధ్యయనం చెబుతోంది.
పాలిమర్‌తో తయారు చేసిన టీ బ్యాగులను వాడడం వల్ల మైక్రో ప్లాస్టిక్‌లు, నానో ప్లాస్టిక్‌లు ఆ టీలో విడుదలవుతాయి. ప్రతిరోజు ఇలాంటి టీ బ్యాగులను వాడితే కొన్నాళ్లకు శరీరంలో ప్లాస్టిక్ పేరుకు పోతుంది. ఇది శరీరంలోని అనేక భాగాలకు వ్యాపిస్తుంది. దీని వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువే.
నానో ప్లాస్టిక్‌లు, మైక్రో ప్లాస్టిక్‌లు రక్త ప్రవాహంలో సులువుగా చేరిపోతాయి. ఇతర శరీర భాగాలలోకి రవాణా అయిపోతాయి. వాటిని చర్మం శరీరం గ్రహించడం మొదలుపెడతాయి. దీనివల్ల క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
మైక్రో ప్లాస్టిక్‌లు, నానో ప్లాస్టిక్‌లు మనం పీల్చే గాలి ద్వారా అయినా ఆహారం ద్వారా అయినా శరీరంలో చేరితే మెదడు, గుండె, మూత్రపిండాలు, మగవారిలోని వృషణాలు విపరీతంగా ప్రభావితం అవుతాయి. ఇవి ఎక్కడైనా కూడా చేరి సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎంతోమందికి ఒక సందేహం ఉండి ఉండవచ్చు. టీ బ్యాగులు కాగితంతో కదా తయారవుతాయి అని. నిజమే, చాలా టీ బ్యాగులు కాగితంతోనే తయారవుతాయి. కానీ వాటిని కాస్త ప్లాస్టిక్ ను ఉపయోగించి మూసివేస్తారు. టీ బ్యాగులో ఉన్న పొడి బయటికి రాకుండా ఉండాలంటే మూతిని గట్టిగా మూసేయాలి.
అక్కడ ప్లాస్టిక్ మెష్‌ను ఉపయోగిస్తారు. దీనివల్లే ఎంతో కొంత ప్లాస్టిక్ టీ బ్యాగ్ లో ఉండే అవకాశం ఉంది. దాన్ని వేడి వేడి నీళ్లలో వేయగానే మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ లు విడుదలవడం మొదలవుతాయి.
టీ బ్యాగులను ఏవి పడితే అవి వాడడం కన్నా ఇంట్లోనే టీ ని తయారు చేసుకోవడం మంచిది. లేదా టీ ఆకులను ఎంపిక చేసుకొని నీటిలో వేసుకొని కలుపుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు టీ బ్యాగులను దూరం పెట్టడమే ఉత్తమం.
Also Read: ఇలా చేస్తే.. గార పట్టిన పళ్లు క్షణాల్లోనే.. తెల్లగా మెరిసిపోతాయ్
ఇంట్లో ఉన్నప్పుడు టీ బ్యాగులను వాడకండి. వీలైనంత వరకు పాత్రలోనే నీరు, పాలు వేసి బాగా మరగకాచి టీ చేసుకోవాలి. ఏదైనా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే వండకుని తినడం పూర్తిగా ఆరోగ్యకరం.