Vijayanagara Empire: దక్షిణ భారతదేశ చరిత్రలో స్వర్ణయుగాన్ని లిఖించిన విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు వైభవం, సంపద, కళలు గుర్తుకొస్తాయి. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యంగా వెలిగిన ఈ సామ్రాజ్యం.. కేవలం ఒక్క రోజులో కుప్పకూలిపోయిందనే మాట వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ క్రీస్తుశకం 1565 జనవరి 23న జరిగిన ఆ ఒక్క యుద్ధం, శతాబ్దాల వైభవానికి శాశ్వతంగా తెరదించింది.
కృష్ణానది తీరాన రక్కసి-తంగడి అనే గ్రామాల మధ్య జరిగిన ఈ యుద్ధాన్నే ‘తాళికోట యుద్ధం’ అంటారు. విజయనగర సైన్యానికి అప్పటి మంత్రి, సర్వాధికారి అయిన ఆలియ రామరాయలు నాయకత్వం వహించారు. డెక్కన్ సుల్తానుల ఉమ్మడి సైన్యంతో రామరాయల సైన్యం తలపడింది. యుద్ధం ప్రారంభంలో విజయనగర సైనికులు శత్రువులపై పైచేయి సాధించారు. సుల్తానుల గుడారాలను ముట్టడించి, విజయం వైపు దూసుకుపోతున్న తరుణంలో ఊహించని దారుణం జరిగింది.
విజయనగర సైన్యంలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు ముస్లిం సేనాధిపతులు గిలానీ సోదరులు చివరి నిమిషంలో సుల్తానుల వైపు మారిపోయారు. తమతో పాటు వేలాది మంది సైనికులను తీసుకుని స్వపక్షంపైనే దాడికి దిగారు. ఈ అకస్మాత్తు నమ్మకద్రోహంతో విజయనగర సైన్యం ఒక్కసారిగా గందరగోళంలో పడిపోయింది. శత్రువుల వ్యూహాన్ని తిప్పికొట్టే సమయం కూడా రామరాయలకు దక్కలేదు.
Also Read: వైన్ బాటిల్స్ ఎప్పుడూ 750ml ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న క్రేజీ హిస్టరీ తెలిస్తే..
యుద్ధరంగంలో ఎనభై ఏళ్ల వయసున్న రామరాయలు ఏనుగుపై కూర్చుని సైన్యాన్ని నడిపిస్తున్నారు. నమ్మకద్రోహం వల్ల సైన్యం చెల్లాచెదురవడంతో, శత్రువులు ఆయనను చుట్టుముట్టారు. నిజాం షా స్వయంగా రామరాయల శిరచ్ఛేదం చేసి, ఆ తలను బల్లెనికి గుచ్చి యుద్ధరంగంలో ప్రదర్శించాడు. తమ నాయకుడు మరణించాడని తెలియగానే విజయనగర సైనికులలో ధైర్యం నశించి, ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోవడం ప్రారంభించారు.
యుద్ధంలో విజయం సాధించిన సుల్తానుల సైన్యం నేరుగా విజయనగర రాజధాని అయిన హంపీ వైపు దూసుకువచ్చింది. రాజభవనంలో ఉన్న రాయల కుటుంబ సభ్యులు, మిగిలిన సైన్యం విలువైన సంపదను తీసుకుని పెనుగొండకు పారిపోయారు. రక్షణ లేని హంపీ నగరం శత్రువుల చేతికి చిక్కింది. వారు నగరంలోకి ప్రవేశించి కంటికి కనిపించిన ప్రతిదాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు.
సుల్తానుల సైన్యం హంపీ నగరంలో దాదాపు ఐదు నెలల పాటు తిష్ట వేసింది. ప్రపంచంలోనే అత్యంత అందమైన రాజభవనాలు, అద్భుతమైన శిల్పాలు కలిగిన దేవాలయాలను ముక్కలు ముక్కలుగా నరికేశారు. బంగారు, వెండి ఆభరణాలను, విలువైన వజ్రాలను దోచుకున్నారు. నగరం మొత్తానికి నిప్పు పెట్టడంతో ఎటు చూసినా పొగలు, మంటలు మాత్రమే మిగిలాయి. ఆ విధంగా శతాబ్దాల వైభవం బూడిద కుప్పగా మారింది.
తాళికోట యుద్ధం జరిగిన ఆ ఒక్క రోజు విజయనగర సామ్రాజ్య భవిష్యత్తును మార్చేసింది. అంతర్గత కలహాలు, నమ్మకద్రోహం ఎంతటి బలమైన రాజ్యాన్నైనా కూల్చేస్తాయని ఈ ఘటన నిరూపించింది. ఒక్క రోజులోనే సామ్రాజ్య కేంద్రం కూలిపోయినా.. భారతీయ సంస్కృతిని, కళలను రక్షించడంలో విజయనగర రాజులు చేసిన కృషి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
Also Read: రామసేతు నిజంగానే మనుషులు కట్టారా? నాసా చిత్రాలు, సైన్స్ పరిశోధనల్లో తేలింది ఇదే!