Wine Bottle Size History: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వైన్ బాటిల్స్ అనగానే మనకు రెండు విషయాలు వెంటనే గుర్తొస్తాయి. ఒకటి.. వాటి పరిమాణం కచ్చితంగా 750 మిల్లీలీటర్లు ఉండటం. రెండు.. ఆ బాటిల్స్ ఎప్పుడూ ముదురు రంగులో కనిపించడం. అయితే ఇలా ఉండటానికి అసలు కారణాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కేవలం వ్యాపారమే కాదు.. ఎంతో ఆసక్తికరమైన చరిత్ర, సైన్స్, మానవ అలవాట్లు దాగున్నాయి.
పూర్వ కాలంలో వైన్ బాటిళ్లను తయారు చేయడానికి ప్రత్యేకమైన యంత్రాలు ఉండేవి కావు. గాజును కరిగించి, నోటితో గాలి ఊదుతూ చేతితోనే బాటిల్స్ తయారు చేసేవారు. ఆ కాలంలో ఒక సాధారణ మనిషి ఒకే ఊపిరిలో గరిష్టంగా 750 ml పరిమాణంలో మాత్రమే గాలిని ఊదగలిగేవారట. అందుకే బాటిల్స్ సహజంగానే ఆ సైజులో తయారయ్యేవి. దీంతో పాటు.. ఒక మనిషి భోజనంతో పాటు తాగడానికి ఈ 750 ml వైన్ సరిగ్గా సరిపోతుందని, అంటే దాదాపు ఆరు గ్లాసుల వైన్ వస్తుందని భావించేవారు.
చరిత్రలో ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మధ్య జరిగిన వైన్ వ్యాపారం కూడా ఈ పరిమాణాన్ని ఖరారు చేయడానికి ఒక ముఖ్య కారణం. ఫ్రెంచ్ వారు వైన్‌ను లీటర్లలో కొలిస్తే.. బ్రిటిష్ వారు మాత్రం తమ సొంత కొలతలను వాడేవారు. ఈ రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు సులభం కావడానికి 750 ml బాటిల్ ఒక వారధిలా పనిచేసింది. అలాగే రవాణా చేసేటప్పుడు, అమ్మేటప్పుడు లెక్కలు సరిచూసుకోవడానికి ఈ పరిమాణం చాలా అనుకూలంగా ఉండేది.
Also Read: ఎయిర్ కండీషనర్ కెపాసిటీని టన్నుల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?
వైన్ బాటిల్ సైజు దాని నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. వైన్ బాటిళ్లను గట్టిగా మూసి ఉంచడానికి కార్క్ ముక్కలను వాడతారు. ఈ 750 ml బాటిల్లో వైన్ పోసిన తర్వాత కార్క్ కింద ఉండే కొద్దిపాటి ఖాళీ స్థలం, అందులోని ఆక్సిజన్ పరిమాణం వైన్ సరైన పద్ధతిలో పక్వానికి రావడానికి సహాయపడతాయి. ఇది వైన్ చాలా కాలం పాటు పాడవకుండా, మంచి రుచితో ఉండటానికి దోహదం చేస్తుంది.
వైన్ తయారీదారులకు, వ్యాపారులకు ఈ 750 ml బాటిల్స్ ప్యాకింగ్ చేయడానికి, ఒక చోటు నుండి మరో చోటుకి తరలించడానికి చాలా సౌకర్యవంతంగా అనిపించాయి. ఖర్చు పరంగా చూసినా.. చేత్తో పట్టుకుని వాడుకోవడానికి చూసినా ఈ సైజు అందరికీ అనుకూలంగా మారింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్ పరిశ్రమ అంతా ఈ పరిమాణాన్నే ప్రామాణికంగా స్వీకరించింది.
మార్కెట్లో కేవలం 750 ml మాత్రమే కాకుండా.. ఇతర సైజులు కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో సగం అంటే 375 ml బాటిల్స్ చిన్న అవసరాలకు లేదా స్వీట్ వైన్స్ కోసం వాడతారు. అలాగే ‘మాగ్నమ్’ అని పిలిచే 1.5 లీటర్ల పెద్ద బాటిల్స్ కూడా ఉంటాయి. ఇవి సాధారణంగా పెద్ద పెద్ద వేడుకల్లో కనిపిస్తుంటాయి. పెద్ద బాటిళ్లలో వైన్ చాలా నెమ్మదిగా పక్వానికి వస్తుంది.
మొదట్లో గాజు బాటిల్స్ తయారు చేసేటప్పుడు ముడి పదార్థాల నుండి ఇనుమును పూర్తిగా వేరు చేయడం సాధ్యం కాలేదు. దీనివల్ల బాటిల్స్ సహజంగానే పచ్చ రంగులోకి వచ్చేవి. అయితే వైన్‌కు వెలుతురు తగలకూడదు. సూర్యకాంతి లేదా తీవ్రమైన వెలుతురు తగిలితే వైన్ త్వరగా పాడైపోతుంది. ముదురు రంగు బాటిల్స్ కేవలం 8 నుండి 37 శాతం వెలుతురును మాత్రమే లోపలికి రానిస్తాయి. అందుకే వైన్ నాణ్యత దెబ్బతినకుండా ఉండటానికి ఇప్పటికీ పచ్చ, గోధుమ రంగు బాటిళ్లను వాడుతున్నారు.
Also Read: పాస్‌వర్డ్‌లు, ఓటీపీల కాలం చెల్లిపోనుందా? సరికొత్త Passkeys టెక్నాలజీ అంటే ఏమిటీ?