Fish Bowl: ఫిష్ బౌల్‌లు ఇంట్లో అందమైన జలచర వాతావరణాన్ని సృష్టించడానికి ఒక అద్భుతమైన మార్గం. ఇవి సాధారణంగా చిన్నవి కావడంతో చేపల ఎంపికలో స్థలం, నీటి నాణ్యత, చేపల స్వభావం, నీటి ఫిల్టరేషన్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అయితే, ఫిష్ బౌల్‌లో పెట్టుకోవడానికి అనువైన చేపలు ఏవి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బెట్టా ఫిష్: బెట్టా చేపల రంగురంగుల రెక్కలు, ఆకర్షణీయమైన స్వభావం వల్ల ఫిష్ బౌల్ ను అందంగా మార్చడమే కాకుండా ఫిష్ బౌల్‌కు అనుకూలమైనవి కూడా. ఈ చేపలు చిన్న స్థలంలో బతుకుతూ నీటి ఉపరితలం నుండి గాలిని తీసుకుంటాయి కాబట్టి ఆక్సిజన్ ఫిల్టర్ అవసరం లేదు. మగ బెట్టాలు ఒకదానితో ఒకటి పోట్లాడటం వల్ల ఒక బౌల్ లో ఒకే బెట్టా చేపను పెట్టాలి. నీటి ఉష్ణోగ్రత 24-28 డిగ్రీల సెల్సియస్ వరకు పెడుతూ నీటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి.
గప్పీ ఫిష్: గప్పీలు చిన్నవి, రంగురంగులవి, శాంతియుత స్వభావం కలిగినవి. ఇవి 5-10 లీటర్ల ఫిష్ బౌల్ లో సౌకర్యవంతంగా జీవించడమే కాదు వాటి పునరుత్పత్తిని త్వరగా చేస్తాయి. కాబట్టి వాటి సంఖ్యను నియంత్రించడం ముఖ్యం. ఫిల్టర్ లేని పక్షంలో, వారానికి ఒకసారి నీటిని మార్చుకుంటూ ఉండాలి.
వైట్ క్లౌడ్ మౌంటైన్ మిన్నో: ఈ చిన్న చేపలు ఫిష్ బౌల్ లకు అనువైనవి మాత్రమే కాదు ఇవి చల్లని నీటిలో (18-24°C) కూడా బతకగలవు. ఇవి శాంతియుతమైన చిన్న సమూహాలలో ఉంచితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
జాగ్రత్తలు:
ఫిష్ బౌల్ లో చేపలకు అధిక ఆహారం వేయడం వల్ల నీరు కలుషితమవుతుంది. చిన్న హీటర్, లైటింగ్ వ్యవస్థ వాడితే చేపలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే, గోల్డ్ ఫిష్ వంటి చేపలు ఎక్కువ స్థలం, ఆక్సిజన్ ను కోరతాయి కాబట్టి వాటిని ఫిష్ బౌల్ లో పెట్టకూడదు.
బెట్టా, గప్పీ, వైట్ క్లౌడ్ మిన్నో వంటి చేపలు ఫిష్ బౌల్ లకు అనువైన ఎంపికలు. సరైన సంరక్షణ, శ్రద్ధతో చూసుకుంటే ఈ చేపలు మీ ఫిష్ బౌల్ ను ఒక అందమైన జలప్రపంచంగా మార్చగలవు.