ఇప్పుడు చాలా ఇళ్లల్లో పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలో టీ తాగడం అలవాటు చేసుకున్నారు. తల్లిదండ్రులు తాగుతున్నప్పుడు పిల్లలు ఏడిస్తే వారికి కూడా టీ ఇచ్చేస్తున్నారు. నిజానికి చిన్న పిల్లలకు టీ ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదు. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం 12 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పిల్లలకు చాయ్ ఇవ్వడం ప్రరమాదకరం.
పిల్లలకు నో టీ.. ఎందుకు
డాక్టర్లు చెబుతున్న ప్రకారం చాయ్‌లో ఉండే టానిన్స్, కెఫీన్ ఉంటాయి. ఇవి పిల్లల శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. టానిన్స్ అనే సమ్మేళనాలు శరీరం ఇనుమును శోషించుకోకుండా అడ్డుకుంటుంది. అంటే ఆహారంలో ఉన్న ఐరన్‌ను శరీరం సరిగా పీల్చుకోలేకపోతుంది. పరిశోధనల ప్రకారం చాయ్ తాగడం వలన శరీరంలోకి వెళ్లే ఐరన్ శాతం సుమారు 50 శాతం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మనదేశంలో చిన్నారులలో ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య విపరీతంగా ఉంది. ఈ పరిస్థితిలో పిల్లలకు టీ ఇవ్వడం మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐరన్ లోపం వలన పిల్లల మానసిక అభివృద్ధి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
పిల్లలపై కెఫీన్ ప్రభావం
టీలో ఉండే కెఫీన్ పిల్లలకు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. పెద్దవారికి కూడా శరీరంలో కెఫీన్ ఎక్కువైతే నిద్రలేమి, గుండె వేగం పెరగడం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. చిన్నారులలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. పిల్లలు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే వారి మెదడు అభివృద్ధి దెబ్బతింటుంది. నిద్రలోనే పిల్లల మెదడు కొత్త విషయాలను గ్రహించే సామర్థ్యాన్ని పొందుతుంది. ఎప్పుడైతే కెఫీన్ ఎక్కువ అవుతుందో అప్పుడు మెదడు ఆ సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాబట్టి చిన్న పిల్లలకు చాయ్ ఇవ్వడం వలన నిద్రకు అంతరాయం కలిగి, వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
పెద్దవారు తాగుతున్నప్పుడు పిల్లలు కూడా కావాలనిఅడుగుతారు. పిల్లలు ఏడుస్తున్నారని కొద్దిగా చాయ్ ఇవ్వడం చేస్తుంటారు. పన్నెండేళ్ల లోపు పిల్లలకు చాయ్ ఇవ్వకూడదని, ముఖ్యంగా పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలకు ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. వారి ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, ఉసిరికాయలు, గుడ్లు, బెల్లం వంటి వాటిని ఆహారంలో చేర్చడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలే కాదు పెద్దలు కూడా టీ రోజులో ఒకసారి తప్ప ఎక్కువసార్లు తాగకూడదు. అందులో ఉండే కెఫీన్ వల్ల పెద్ద వారికి కూడా నిద్రలేమి సమస్యా వచ్చేస్తుంది. అధికంగా చాయ్ తాగే వారికి గుండె దడ లేదా ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది హైబీపీ ఉన్నవారికి ప్రమాదకరంగా మారవచ్చు. ఎక్కువగా టీ తాగే వారిలో దంతాల రంగు మారడం, నోటి దుర్వాసన, ప్లాక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, బ్లాక్ టీ లేదా స్ట్రాంగ్ టీని ఎక్కువగా తాగడం వలన ఆక్సలేట్స్ శరీరంలో పేరుకుపోతాయి. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతాయి.