Sleep By Age: మనం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే పోషకాహారం, వ్యాయామంతో పాటు అత్యంత కీలకమైనది ‘నిద్ర’. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. మన శరీరంలోని వివిధ వ్యవస్థలు తమను తాము మరమ్మత్తు చేసుకునే ముఖ్య ప్రక్రియ. ప్రతి వయస్సు వారికి వారి పెరుగుదల, అభివృద్ధి, ఆరోగ్య అవసరాలను బట్టి ఎంత నిద్ర అవసరమో నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నపిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం:
పిల్లలు వేగంగా ఎదుగుతారు. ఈ వయస్సులోనే వారి మెదడు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వారికి పెద్దల కంటే ఎక్కువ నిద్ర అవసరం.
శిశువులు (0–3 నెలలు): వీరికి రోజుకు 14–17 గంటల నిద్ర (పగటి పూట కునుకులతో కలిపి) అవసరం.
పసిపిల్లలు (4–12 నెలలు): వీరికి రోజుకు 12–16 గంటల నిద్ర అవసరం.
నడక నేర్చుకునే పిల్లలు (1–2 సంవత్సరాలు): వీరికి రోజుకు 11–14 గంటల నిద్ర అవసరం.
ప్రీ-స్కూల్ పిల్లలు (3–5 సంవత్సరాలు): వీరికి రోజుకు 10–13 గంటల నిద్ర అవసరం.
బడికి వెళ్లే పిల్లలు, టీనేజర్లు:
స్కూల్, చదువు, ఆటలు అన్నిట్లో పాల్గొనే పిల్లలకు శక్తి ఎక్కువ ఖర్చవుతుంది. పెరుగుతున్న శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం.
బడికి వెళ్లే పిల్లలు (6–12 సంవత్సరాలు): వీరికి ప్రతి రాత్రి 9–12 గంటల నిద్ర అవసరం.
టీనేజర్లు (13–18 సంవత్సరాలు): ఈ వయసులో హార్మోన్ల మార్పులు, చదువుల ఒత్తిడి ఉంటాయి. వీరికి 8–10 గంటల నిద్ర తప్పనిసరి. చాలా మంది టీనేజర్లు తక్కువ నిద్ర పోవడం వల్ల ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యువకులు, పెద్దలకు నిద్ర:
పెద్దల విషయానికి వస్తే.. నిద్ర అవసరం కొద్దిగా తగ్గుతుంది. కానీ నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం.
యువకులు, పెద్దలు (18–64 సంవత్సరాలు): ఆరోగ్యంగా ఉన్న పెద్దలకు ప్రతి రాత్రి కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
వృద్ధులు (65 సంవత్సరాలు పైబడిన వారు): ఈ వయస్సు వారికి కూడా దాదాపుగా యువకులకు ఉన్నంత నిద్ర అవసరమే. అయితే.. వారి నిద్ర విధానంలో మార్పులు రావచ్చు. రాత్రిపూట తరచుగా మేల్కొనడం, పడుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. వీరికి 7–8 గంటల నిద్ర సరిపోతుంది.
వ్యక్తిగత అవసరాలు ముఖ్యమైనవి:
పైన చెప్పిన నిద్ర సమయాలు కేవలం సిఫార్సులు మాత్రమే. ప్రతి వ్యక్తికి వారి జీవనశైలి, శారీరక శ్రమ, ఆరోగ్యం, జన్యుపరమైన అంశాలను బట్టి నిద్ర అవసరాలు కొద్దిగా మారతాయి.
Also Read: రోజూ ఏబీసీ జ్యూస్ తాగితే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !
మీకు ఎంత నిద్ర అవసరం ?
పడుకున్న వెంటనే పడుకుండిపోయి, ఉదయం లేచిన తర్వాత శక్తివంతంగా, ఉల్లాసంగా, రోజంతా ఏకాగ్రతతో పనిచేయగలిగితే.. మీరు తగినంత నిద్ర పొందుతున్నట్లే లెక్క.
ఎక్కువ నిద్ర: కొన్ని సందర్భాలలో (అనారోగ్యం, నిద్ర లేమిని భర్తీ చేయడం) 9 గంటల కంటే ఎక్కువ నిద్ర అవసరం కావచ్చు. కానీ తరచుగా ఎక్కువ నిద్ర పోవడం కూడా అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
సరిపడా నిద్ర లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి.. మీ వయస్సుకు తగ్గట్టుగా, నాణ్యమైన నిద్రను పొందడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం.
మన శరీరం, మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతి వయసు వారు తమకు అవసరమైనంత నిద్రను కచ్చితంగా తీసుకోవాలి. నిద్రను నిర్లక్ష్యం చేయకుండా.. దాన్ని రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా భావించాలి.