శారీరక అభివృద్ధికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా పెరుగు ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తిన్నవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. సంపూర్ణమైన ఆహారం అంటే అందులో పెరుగు కూడా ఒక భాగమే. అయితే ఎంతో మందికి పెరుగును చక్కెరతో తినాలా లేక ఉప్పుతో తినాలా అన్న సందేహం ఉంటుంది.
కాబట్టి పెరుగులో ఉప్పు కలుపుకొని తింటే ఏం జరుగుతుందో, అలాగే పంచదార కలుపుకొని తింటే ఏం జరుగుతుందో తెలుసుకోండి. దాన్నిబట్టి మీరు ఉప్పు లేదా పంచదార ఏది కలుపుకొని తినాలన్నది నిర్ణయించుకోవచ్చు.
పెరుగులో ఉప్పు కలపడం వల్ల ప్రభావం
పెరుగులో ఉప్పు కలుపుకొని తినడం వల్ల మంచి బ్యాక్టీరియా చాలా వరకు నశించిపోతుంది. అలాంటి పెరుగును తిన్నా తినకపోయినా ఒక్కటే. ఉప్పు కలిపిన పెరుగును తీసుకోవడం శరీరానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదు. ఇక మీరు హైబీపీతో బాధపడుతూ ఉంటే పెరుగులో ఉప్పు వేసుకోకూడదు. అది శరీరానికి మరింత రెట్టింపు హాని కలిగిస్తుంది.
ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం పెరుగులో ఉప్పు కలుపుకొని తినడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావమే పడుతుంది. ముఖ్యంగా పిత్త సమస్యలు ప్రారంభమవుతాయి. పిత్త సంబంధిత సమస్యలు ఉన్నవారు పెరుగులో ఉప్పు కలుపుకొని తింటే విషం తీసుకున్నట్టే. పెరుగులో ఉప్పు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా పెరిగిపోతాయి. పొట్ట సంబంధిత అనారోగ్యాలు ఎక్కువవుతాయి. దగ్గుతో బాధపడుతున్న వారు పెరుగులో ఉప్పు కలుపుకొని తాగడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. దీని వల్ల దగ్గు మరింతగా పెరుగుతుంది.
పెరుగులో పంచదార కలుపుకొని తింటే
పెరుగులో చక్కెర కలుపుకొని తినడానికి ఇష్టపడే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఇలా తినడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో తెలుసుకుందాం. పెరుగులో చక్కెర కలుపుకొని తినడం వల్ల జీర్ణవ్యవస్థకు మంచి మద్దతు లభిస్తుంది. అలాగే పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఎలాంటి హాని కలగదు. అలాగే పొట్టలో ఉండే చికాకులను, అసౌకర్యాలను తగ్గించడంలో తీపి పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది.
కాకపోతే పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందుతాయి. దీని వల్ల బరువు చాలా వరకు తగ్గిపోతారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం పెరుగులో చక్కెర కలుపుకొని తినకూడదు. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను చాలా పెంచేస్తుంది.
పెరుగు ఎలా తింటే మంచిది?
పెరుగు తీసుకోవడం శరీరానికి మంచిదే… అయితే దాన్ని ఎలా తీసుకోవాలో మాత్రం చాలామందికి తెలియదు. మీ ఆరోగ్య పరిస్థితులు బట్టి పెరుగులో ఉప్పు వేసుకోవాలా, చక్కెర కలుపుకోవాలా అన్నది నిర్ణయించుకోవాలి. అయితే పెరుగులో ఉప్పు వేసుకొని తినకపోవడమే అన్నింటికీ మంచిది. అలాగే ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి పరిస్థితులతో బాధపడుతున్న వారు పెరుగులో ఉప్పు, చక్కెర ఏదీ వేసుకోకుండా తినడమే ఉత్తమం. పెరుగును పెరుగు లాగే నేరుగా తీసుకుంటే శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం దక్కుతుంది. కాబట్టి మీరు ఉప్పు, చక్కెర ఏది లేకుండానే పెరుగు తినేందుకు ప్రయత్నించండి.