హైదరాబాదులోని జీడిమెట్లలో జరిగిన ఒక సంఘటన ఒక్కసారిగా తెలుగు ప్రజలు ఉలిక్కిపడేలా చేసింది. పదవ తరగతి చదువుతున్న అమ్మాయి తన ప్రియుడు, అతని తమ్ముడితో కన్నతల్లిని అతి కిరాతకంగా హత్య చేయించింది. చిన్న వయసులోనే ప్రేమలో పడడం, ఇలా నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడడం వంటివన్నీ ప్రస్తుత సమాజంలో ఎక్కువైపోతున్నాయి.
జీడిమెట్ల సంఘటనలో అమ్మాయి ప్రేమించిన అబ్బాయి… బాగా చదువుకున్నవాడు, సంస్కారవంతుడో కాదు. చదువు సరిగా సాగక రోడ్లు మీద తిరుగుతూ, చిన్నచిన్న పనులు చేసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ అమ్మాయికి ఎందుకు నచ్చాడో, అతని చేతే కన్నతల్లినే చంపించేంత కసి అమ్మాయికి ఎందుకు పుట్టిందో తెలియదు.
పద్దతిగా ఉండే వాళ్లు ఎందుకు నచ్చరు?
మన దేశంలోని టీనేజర్లలో ఎక్కువ మంది పద్ధతిగా, సంస్కారవంతంగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలను ఇష్టపడడం లేదు. జాలీగా, ఖాళీగా తిరుగుతూ.. ఎలాంటి బాధ్యత లేకుండా ఉండేవారినే ఇష్టపడుతున్నారు. వారిని చూస్తేనే ఎందుకు కొంతమందిలో ప్రేమ పుడుతుందో అర్థం కావడం లేదు. ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే గాలికి తిరిగే వేస్ట్ గాళ్లనే ఎక్కువ మంది ప్రేమిస్తున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.
వేస్ట్ గాళ్ళు అంటే…
పనికిరాని అబ్బాయిలు అనగానే దానికి నిర్వచనం ఎంతో మంది వెతుకుతూ ఉంటారు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కుటుంబ బాధ్యతను, ఉద్యోగ బాధ్యతను, చదువును పట్టించుకోకుండా, పనీ పాటు లేకుండా రోడ్లమీద తిరిగే వాళ్ళని వేస్ట్ గాళ్లు అంటారు. వారిలో నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. తిరుగుబాటు ధోరణి కూడా ఎక్కువే. ప్రతి పనిని సరదాగా చేసి పడేస్తారు. భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రణాళికలు ఉండవు. ఆ క్షణం ఎంజాయ్ చేయడానికి చూస్తారు. ఇలాంటి టీనేజర్లు చూసేందుకు చాలా రఫ్ గా, దురుసుగా, బోల్డ్ గా కనిపిస్తారు. ఆ బోల్డ్ తనం వల్లే అమ్మాయిలకి అలాంటి అబ్బాయిలు నచ్చుతున్నారేమో అన్న సందేహం కూడా వస్తుంది.
సినిమాల పాత్ర కూడా ఎక్కువే
అబ్బాయిలు బోల్డ్ గా, రఫ్ గా, దురుసుగా మారడానికి భారతీయ సినిమాలు కూడా కారణమనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సినిమాల్లో హీరోతనాన్ని చూపించడానికి డబుల్ మీనింగ్ డైలాగులు, రోడ్లపై కొట్లాటలు వంటివి చిత్రీకరిస్తారు. ఆ సినిమాలను చూసిన టీనేజర్స్ కూడా ఆ హీరోలా ఉండాలని ప్రయత్నిస్తారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో అలాంటి రీల్స్ అధికంగా ఉంటాయి. టీనేజర్స్ అంతా తాము హీరోలాగా భావించి రోడ్లమీద తిరుగుతూ, డాన్సులు చేస్తున్న రీల్స్ ను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే సినిమాల్లోని డబుల్ మీనింగ్ డైలాగులను కూడా రీల్స్ చేస్తూ ఉంటారు.
టీనేజర్స్‌లో స్నేహితుల పాత్ర చాలా ఎక్కువ. పద్దతి ప్రకారం ఉండే స్నేహితులు ఉంటేనే ఎవరి జీవితమైనా చక్కగా సాగుతుంది. స్నేహితుల్లో బాధ్యతగా చదివేవారు, ప్రతిరోజు కాలేజీలకు వెళ్లేవారు, తల్లి తండ్రి మాటను మన్నించేవారు ఉంటే… వారిలాగే ఉండాలని ఇతరులకు అర్థమవుతుంది. కానీ స్నేహితుల్లో ఎక్కువమంది బోల్డ్‌గా, రఫ్‌గా ఉండేవారు ఉంటే వారిని చూసి ఫాలో అయిపోయే వారు ఎంతోమంది ఉంటారు. కాబట్టి స్నేహితుల ప్రభావం కూడా నేను టీనేజర్స్ పై అధికంగానే ఉంటుంది.
టీనేజర్స్ ముఖ్యంగా భావోద్వేగ కనెక్షన్ కోసం వెతుకుతారు. తమ మాట వినే వారి కోసం ఎదురు చూస్తారు. అలా ఎవరైనా కనిపిస్తే వారితో కనెక్ట్ అయిపోతారు. ఇంట్లో ప్రేమ కొరత ఉన్నా కూడా టీనేజర్లు బయట ప్రేమ వెతుక్కోవడమనేది అధికమైపోతోంది. కాబట్టి టీనేజీలోనే తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ బాధ్యతను ప్రేమను చూపించాల్సిన అవసరం ఉంది.
టీనేజ్ అనేది జీవితంలో ఒక దశ మాత్రమే. ఈ వయసులో ఉన్న ఇష్టాలు పెద్దయ్యాక ఉండవు. అవన్నీ మారిపోతాయి. టీనేజీని దాటిన తర్వాత వారి దృష్టి, ఉద్యోగము, కుటుంబము, లక్ష్యము వంటి వాటి వైపు మారుతుంది. కానీ టీనేజీలోనే జీవితాన్ని నాశనం చేసుకున్న తర్వాత పెద్దయ్యాక వారు సాధించేది ఏమీ లేకుండా పోతోంది.
నేటి యువత పనిలేకుండా గాలికి తిరిగే వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు? పనీ పాటూ లేని రఫ్ గా ఉండే వ్యక్తులు వారికి ఎందుకు నచ్చుతున్నారు.. వంటివి నిర్ధారించడం అంత సులభం కాదు. ఏ అధ్యాయము కూడా ఒక శాస్త్రీయ ఆధారాన్ని ఈ విషయంలో కనిపెట్టలేకపోయింది. కొందరు వినోదం కోసం అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొందరి వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. అలాగే వారు పెరిగే వాతావరణం కూడా వారి మాట తీరును, ప్రవర్తనను ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు టీనేజీకి చేరుతున్న పిల్లలపై ప్రత్యేక దృష్టిని పెట్టుకోవాలి.