Stye: చాలా మందికి తరచుగా కంటి కురుపు వస్తూ ఉంటుంది. ఇది చిన్నగా, ఎర్రగా, నొప్పితో కూడిన గడ్డలా కనిపిస్తుంది. సాధారణంగా అయితే కొన్ని రోజుల్లోనే కంటి కురుపు తగ్గిపోతుంది. కానీ, దీని వల్ల కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. దీంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు కంటి కురుపు ఎందుకు వస్తుంది? దాన్ని తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కంటి కురుపు ఎందుకు వస్తుంది?
కంటి కురుపు సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కంటి రెప్పల్లో ఉండే మీబోమియన్ అనే ఆయిల్ గ్లాండ్స్ మూసుకుపోవడం వల్ల ఇలా జరుగుతుందట. ఈ గ్రంథులు కంటిని తేమగా ఉంచే నూనెను ఉత్పత్తి చేస్తాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ గ్రంథులు సరిగా పని చేయకపోతే, బ్యాక్టీరియా సులభంగా చేరిపోతుంది. దీని వల్ల కంటి కురుపు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇతర కారణాలు
కంటి శుభ్రత లేకపోవడం వల్ల కూడా కంటి కురుపు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కళ్లను సరిగా శుభ్రం చేయకపోతే ధూళి, మేకప్, లేదా చెమట వంటికి కళ్ల లోపలికి వెళ్లిపోతాయి. దీని వల్ల కూడా చాలా సార్లు కంటిలో కురుపులో ఏర్పడే ఛాన్స్ ఉందట.
ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన మేకప్ లేదా ఇతరుల మేకప్ ఐటెమ్స్ వాడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరికొందరిలో ఒత్తిడి లేదా రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కంటి కురుపు వచ్చే అవకాశం ఉందట. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు బ్యాక్టీరియా త్వరగా ఎటాక్ చేస్తుంది. దీని వల్ల కూడా కళ్లకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
రోసేసియా లేదా సెబోర్హెయిక్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో సరిగా శుభ్రం చేయని కాంటాక్ట్ లెన్సులు వాడడం వల్ల కంటి కురుపు వచ్చే ప్రమాదం ఉంది.
కంటి కురుపును తగ్గించడానికి ఏం చేయాలి?
కంటి కురుపు సాధారణంగా ఇంట్లోనే తగ్గించుకునే మార్గం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శుభ్రమైన గుడ్డను వెచ్చని నీటిలో ముంచి, కంటి కురుపు ఉన్న ప్రదేశంలో 10-15 నిమిషాలు ఉంచాలి. రోజుకు 3-4 సార్లు ఇలా చేయడం వల్ల ఆయిల్ గ్లాండ్స్ తెరుచుకుంటాయి. దీని వల్ల కంటి కురుపు కూడా తగ్గిపోతుందట.
కంటి కురుపు ప్రభావం ఎక్కువగా ఉంటే, డాక్టర్లు సూచించిన యాంటీబయోటిక్స్, ఐ డ్రాప్స్ లేదా ఆయింట్‌మెంట్ వాడడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఒత్తిడి కారణంగా కూడా కంటి కురుపులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం అలవాటు చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.