జీవితంలో ఎదురయ్యే సమస్యలకు బయట పరిస్థితులే కారణమని చాలా మంది భావిస్తారు. అయితే ఆచార్య చాణక్యుడు దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన ప్రకారం మనిషికి అతిపెద్ద శత్రువు బయట కాదు, అతని మనసులోనే ఉంటాడు. మన ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాలు చాలా సందర్భాల్లో మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. చాలా మంది ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది సరైనదేనని నమ్ముతారు. కానీ కొంతకాలం తర్వాత అది తప్పుడు నిర్ణయం అని తెలుసుకుంటారు. దీనికి కొన్ని మానసిక కారణాలు ఉన్నాయని చాణక్యుడు వివరించాడు.
చాణక్యుడి ప్రకారం దురాశ మనిషి వివేకాన్ని తగ్గిస్తుంది. విజయాన్ని లేదా సంపదను చాలా త్వరగా పొందాలనే కోరిక పెరిగితే వ్యక్తి సరైన విశ్లేషణ చేయలేడు. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను నిర్లక్ష్యం చేసి త్వరిత నిర్ణయాలు తీసుకుంటాడు. దురాశ వల్ల మనిషి లాభాల గురించే ఆలోచిస్తాడు. కానీ నష్టాలు లేదా ప్రమాద సంకేతాలను పట్టించుకోడు. అందుకే ఆశయాలకు, వివేకానికి మధ్య సమతుల్యత ఉండాలని చాణక్యుడు సూచించాడు.
కోపాన్ని చాణక్యుడు మనిషి పెద్ద శత్రువులలో ఒకటిగా పేర్కొన్నాడు. కోపంలో ఉన్నప్పుడు వ్యక్తి ప్రశాంతంగా ఆలోచించలేడు. ఆ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతాయి. సంబంధాలు దెబ్బతినవచ్చు, అవకాశాలు కోల్పోవచ్చు. అందుకే భావోద్వేగ పరిస్థితుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన చెప్పాడు.
భయం మన ఆలోచనా విధానాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. విఫలమవుతామనే భయంతో చాలా మంది మంచి అవకాశాలను వదులుకుంటారు. కొందరు సురక్షితంగా అనిపించే మార్గాన్నే ఎంచుకుంటారు. అసురక్షిత భావం ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల వ్యక్తిగత అభివృద్ధి కూడా మందగిస్తుంది. చాణక్యుడు భయాన్ని ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించాడు.
ఒకరి పట్ల మీరు ఆప్యాయత ఎక్కువగా ఉంటే వారి విషయంలో లేదా సమస్య ఎదురైనప్పుడు నిష్పక్షపాతంగా ఆలోచించలేరు. ఈ కారణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో నిజాలను పట్టించుకోకుండా భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి నిర్ణయాలు తాత్కాలిక సంతృప్తినివ్వవచ్చు. కానీ దీర్ఘకాలంలో సమస్యలకు కారణమవుతాయి. భావోద్వేగ సమతుల్యత ఉంటే పరిస్థితులను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
Also Read: పుట్టిన తేదీని బట్టి పిల్లాడు ఎంత జీనియస్ అని తెలుసుకోండి.. న్యూమరాలజీలో ఈ అంకెలు ముఖ్యం
సరైన సమాచారం లేకుండా తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా విఫలమవుతాయి. చాణక్యుడు జ్ఞానం, వాస్తవాల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించాడు. పూర్తి సమాచారం లేకపోతే ఊహాగానాలతో విషయాన్ని అపోహలు, అపార్థాలు కలుగుతాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలకు ముందు విశ్వసనీయ వనరుల నుంచి సమాచారం సేకరించడం అవసరం.
చాణక్యుడి బోధనలు నేటి జీవితానికి కూడా వర్తిస్తాయి. అత్యాశ, కోపం, భయం, భావోద్వేగాలు, అసంపూర్ణ సమాచారం మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలను గుర్తించి నియంత్రించగలిగితే మనం మరింత తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలం. ప్రశాంతమైన మనసు విజయవంతమైన జీవితానికి బలమైన పునాది అవుతుంది.