మన దేశానికి మరొక గర్వకారణం శుభాన్శు శుక్లా. 1984లో రాకేష్ శర్మ తర్వాత మన దేశం నుంచి అంతరిక్ష కేంద్రానికి చేరిన భారతీయ వ్యోమగామి ఈ శుభాన్షు శుక్లా. ఇప్పుడు ప్రపంచంలో ట్రెండ్ అవుతున్న పేర్లలో ఈయన ఒకరు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్ష నౌకలో ఆయన ప్రయాణించారు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి అధ్యయనాలు నిర్వహించి తిరిగి వస్తారు.
అంతరిక్ష కేంద్రంలో ఆసుపత్రి
అంతర్జాతీయ అంతరిక్ష అంతర్జాతీయ కేంద్రంలో ఉన్న వ్య్యోమగాములు కూడా సాధారణ మనుషులే. వారికి కూడా అప్పుడప్పుడు అనారోగ్యం చేస్తూ ఉంటుంది. ఒక వ్యోమగామి అనారోగ్యానికి గురైనప్పుడు అంతరిక్ష కేంద్రంలో ఎలా చికిత్స పొందుతారనే సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆసుపత్రి ఉంటుందా? అనే సందేహం కూడా ఎంతోమందిలో ఉండి ఉండవచ్చు. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలాంటి ఆసుపత్రి ఉండదు. కేవలం మెడికల్ ఎమర్జెన్సీ కిట్ మాత్రమే ఉంటుంది. అందులో పెయిన్ కిల్లర్‌లు, యాంటీబయోటిక్స్, అలెర్జీ మందులు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి.
అలాగే పోర్టబుల్ అల్ట్రాసౌండ్ యంత్రం, మెటీరియల్‌తో కూడిన బ్యాండేజీలు, ఇంజెక్షన్లు, సిపిఆర్ యంత్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే వ్యోమగాముల్లో వైద్యం గురించి తెలిసిన ఒక సిబ్బంది కూడా కచ్చితంగా ఉంటారు.
వ్యోమగామి ఆరోగ్యం పాడైతే
అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు వ్యోమగామికి ఏదైనా తీవ్రమైన వైద్య పరిస్థితి ఎదురైతే నాసా మిషన్ కంట్రోల్ ను వ్యోమగాములు సంప్రదిస్తారు. పరిస్థితిని బట్టి ఏం చేయాలో వైద్యులు మార్గ నిర్దేశం చేస్తారు. తీవ్ర అనారోగ్యమైతే అంతరిక్ష కేంద్రంలో ఎల్లప్పుడూ ఉండే సోయిజ్ లేదా స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ ను ఉపయోగించి ఆ వ్య్యోమగామిని భూమికి తీసుకువస్తారు. భూమికి వచ్చిన వ్యోమగామిని నాసా లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు లేదా రష్యన్ స్పేస్ ఏజెన్సీలోని ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడే అతనికి చికిత్సను అందిస్తారు.
తెలిసిన నివేదికల ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తీవ్ర అనారోగ్యం పాలైన వ్యోమగామి ఎవరూ లేరు. గత 20 సంవత్సరాల చరిత్రను చూస్తే వ్యోమగాములు మిషన్‌ను వదిలి అనారోగ్య కారణంగా భూమిని తిరిగి వచ్చిన పరిస్థితి ఎదుర్కోలేదు. ఏ వైద్య సమస్య తలెత్తినా అంతరిక్ష కేంద్రంలోనే వారు చికిత్సను పొందారు.
అంతరిక్ష కేంద్రానికి చేరిన శుభాంశు శుక్లా వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని లక్నో. 1999లొ జరిగిన కార్గిల్ యుద్ధం నుంచి ఆయన ప్రేరణ పొందారు. దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. యూపీఎస్సీ ఎన్డీఏ పరీక్షకు సిద్ధమయ్యాడు. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించాడు. ఆయన ఫ్లయింగ్ బ్రాంచికి సెలెక్ట్ అయ్యాడు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశాడు. ఫైటర్ జెట్ లను నడిపించిన అనుభవం శుభాంశు శుక్లాకు ఉంది.