Wrong Food Combinations: మనం ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల పండ్లు, కూరగాయలు, పోషకాహారం తీసుకుంటాం. అయితే.. ఏ పదార్థాన్ని దేనితో కలిపి తింటున్నాము అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు విడివిడిగా అమృతంలా పని చేసినా.. కలిపి తీసుకున్నప్పుడు అవి శరీరంలో టాక్సిన్లుగా మారతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలే కాకుండా.. దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిన 7 తప్పుడు ఫుడ్ కాంబినేషన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆహారం విషయంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రుచి కోసం మనం చేసే ప్రయోగాలు ఒక్కోసారి ఇబ్బంది కలిగించవచ్చు. ఆయుర్వేదంలో దీనిని ‘విరుద్ధాహారం’ అని పిలుస్తారు.
1. పాలు, చేపలు :
చాలా మందికి చేపల కూర తిన్న తర్వాత పాలు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన కాంబినేషన్. పాలు చలవ చేసే గుణం కలిగి ఉంటే.. చేపలు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండు విరుద్ధ స్వభావాలు కలవడం వల్ల శరీరంలో రసాయనిక మార్పులు జరిగి చర్మ వ్యాధులు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
2. పాలు ,నిమ్మ/పుల్లని పండ్లు:
పాలలో నిమ్మరసం పిండితే ఏమవుతుందో మనందరికీ తెలుసు.. పాలు విరిగిపోతాయి! సరిగ్గా ఇదే ప్రక్రియ మన కడుపులో కూడా జరుగుతుంది. పాలు తాగిన వెంటనే లేదా పాలు తాగుతున్నప్పుడు పుల్లని పండ్లు తీసుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
3. తేనె ,వేడి నీళ్లు/వేడి పదార్థాలు:
తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. చాలా మంది బరువు తగ్గాలని వేడివేడి నీళ్లలో తేనె కలుపుకుని తాగుతారు. కానీ తేనెను 40 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేస్తే.. అది విషపూరితంగా మారుతుందని ఆయుర్వేదం చెబుతోంది. తేనెను ఎప్పుడూ గోరు వెచ్చని నీటితో లేదా చల్లని పదార్థాలతోనే తీసుకోవాలి.
4. పెరుగు, పండ్లు :
ఫ్రూట్ సలాడ్‌లో పెరుగు లేదా క్రీమ్ కలుపుకుని తినడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. కానీ పెరుగులో ఉండే బ్యాక్టీరియా పండ్లలోని చక్కెరతో కలిసినప్పుడు జీర్ణవ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది. ఇది సైనస్, జలుబు ,అలర్జీలకు దారితీస్తుంది. ముఖ్యంగా పుల్లని పండ్లను పెరుగుతో కలపడం అస్సలు మంచిది కాదు.
5. భోజనం తర్వాత పండ్లు:
చాలా మంది భోజనం ముగించాక పండ్లు తింటుంటారు. కానీ పండ్లు చాలా త్వరగా జీర్ణమవుతాయి, అదే అన్నం లేదా రోటీలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. భోజనం తర్వాత పండ్లు తింటే.. అవి కడుపులోనే ఉండి పులిసిపోతాయి . దీనివల్ల గ్యాస్ సమస్య తీవ్రమవుతుంది. పండ్లను భోజనానికి గంట ముందు లేదా రెండు గంటల తర్వాత తీసుకోవడం బెస్ట్.
Also Read: ఎండలో నీళ్లు తాగినా ప్రాణాపాయమా? ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత ఎందుకు ముఖ్యం?
6. బంగాళాదుంపలు , అన్నం:
ఇది మన తెలుగు ఇళ్లలో సర్వసాధారణం. కానీ ఈ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అన్నం , ఆలుగడ్డ కలిపి తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి , మధుమేహం ఉన్నవారికి ముప్పుగా మారుతుంది. వీలైనంత వరకు అన్నంతో పీచు పదార్థం ఉన్న కూరలు తినడం మంచిది.
7. పాలు ,అరటిపండు :
మనం ‘బనానా షేక్’ ఆరోగ్యకరమని అనుకుంటాం. కానీ ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటిపండు కలయిక జీర్ణక్రియను చాలా భారంగా మారుస్తుంది. ఇది శరీరంలో టాక్సిన్స్‌ను పెంచుతుంది. అంతే కాకుండా మెదడు పనితీరును నెమ్మదింపజేస్తుంది. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమైతే.. అందులో కొంచెం యాలకుల పొడి లేదా అల్లం పొడి కలిపితే జీర్ణం కావడానికి సహాయపడుతుంది.