ఎల్‌నినో అని భయపడుతున్న వేళ.. సమయానికే తొలకరి పలకరించింది. నేనున్నా అని ఆప్యాయంగా హత్తుకున్నంత పని చేసింది. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించడమే కాదు.. మధురానుభూతులను మూటగట్టుకుని తెచ్చినట్టుగా అనిపించింది.
సరిగ్గా కరెక్టు సమయమే. ఏమాత్రం ఆలస్యం లేదు. ప్రతీసారి ఇదే తంతు.. లేటుగా వానలు.. కరువు పీడలు!అని జనాలు ఫిక్సయిపోయిన వేళ.. దీనికి తోడు ఎల్‌నినో వస్తోందనే బూచి భయపెడుతున్న తరుణంలో.. ఆ వరుణుడు వచ్చాడు. నేనున్నానని. ఒక్కసారిగా కుండపోత. అనుమానాలన్నీ పటాపంచలు చేసేలా. ఉన్నపళంగా కుంభవృష్టి.. మనసు నిండిపోయేలా. చేంజ్ అయిన వాతావరణం చల్లని తుంపరలను కొత్త అతిథులను ఇంటికి తీసుకొచ్చినట్టుగా. ఆ తొలకరి పలకరింపు స్పర్శ మైమరిచి తడిచిన నేల వెదజల్లే ఆ పరిమళాలను ఆస్వాదించే ఆనందాన.. ఉన్న బాధలన్నీతడిచిపెట్టుకు పోయాయనుకో!
అక్షర దోషం కాదు.. నిజంగా తడిచిపెట్టుకుపోయినంత ఆనందం! రాబోయే ఎల్‌నినో ప్రభావమెలా ఉంటుందోనని ఊహకందని ఓ భయం.. కనుల ముందే జోరుజోరుగా పడే వాన జడిలో ఆనందబాష్పాలై ఆ వాననీటి బిందువుల్లో కలిశాయి. ఓ శుభసూచకానికి సూత్రప్రాయ సంకేతంగా భావించినా.. అదే కొండత ధైర్యాన్నిస్తోంది. కుండపోత వానకు మోములన్నీ మైమరిచిపోగా… వానాకాలం పైర్లు తొలకరి స్నానంలో పులకరించి పోయాయి.
మొన్నటిదాకా పడ్డ కర్షక కష్టాలను తన చేతితో తుడిచిపెట్టినట్టుగా వారిని తడిపేసి తడిమిన ఆ వాన.. ఆత్మీయ స్నేహితుడికి ఆపద్భాంధవుడిగా సాక్షాత్కరించినట్టే అయ్యింది. ధాన్య రాశులు పండించిన ఆ నేల.. మరోమారు ఏరువాకకు ముస్తాబు చేసేందుకే వచ్చిందా ఆ వాన! అన్నట్టుగా కరువు ఛాయలు కనబడకుండా నేలంతా తడిపేసింది. నీటి కుంటలను నింపేసింది. చెరువులకు జీవకళను తెచ్చిపెట్టింది. జలచరాలకు కొత్త పండగను తీసుకొచ్చింది. రైతన్న కన్నుల్లో కోటి కాంతులను మోసికొచ్చింది! ఇదంతా చూస్తున్న ఎల్‌నినో ఎక్కడో దాచుకుంది.