Weather Updates : ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా-ఏపీ తీరం వెంబడి కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. నైరుతిని ఆనుకుని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతానికి అల్పపీడనం బలహీనపడిందని, అయినప్పటికీ గురువారం(నవంబర్ 14)న కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈ నెల 15, 16 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇలా..
అల్పపీడనం కారణంగా.. ఈరోజు, రేపు (నవంబర్ 14) ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండనుందో వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వారి ప్రకారం.. గురువారం నాడు
కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే..
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ జిల్లాల్లోని రైతులు వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట పొలాల్లో నిలిచిన అదనపు నీరు బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు చేశారు. కుప్పలుగా పోసిన ధాన్యాన్ని.. తేమ, తడి తగలని ప్రదేశాలకు తరలించాలని అధికారులు సూచించారు.
తెలంగాణాలోని వాతావరణం ఇలా..
నవంబర్ 12 వరకు తెలంగాణ అంతటా పొడి వాతావరణమే ఉంది. కానీ.. ఈరోజు (నవంబర్ 13)న వాతావరణంలో చల్లదనం పెరిగగా, అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. రేపు (నవంబర్ 14న) బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో.. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ అధ్యయన కేంద్రం వెల్లడించింది. నవంబర్ 16వ తేదీ వరకు తెలంగాణలో అల్పపీడన ప్రభావం కనిపిస్తుందని అంచనా వేసిన అధికారులు.. తిరిగి నవంబర్ 17న మళ్లీ రాష్ట్రం అంతటా.. పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది