E-Paper
Advertisement

Top 20 News: పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం…ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ మత్స్యకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

Top 20 News: పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం…ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ మత్స్యకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

1.వనపర్తి జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు

నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని మక్తల్, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. 5 వేల కోట్లతో నిర్మించనున్న నారాయణపేట-మక్తల్‌-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీటిని అందించే ఆశల ప్రాజెక్టుకు అంకురార్పణ చేయనున్నారు.

2.పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 19 వరకు జరిగే ఈ సమావేశంలో మొత్తం 15 పనిదినాలు ఉంటాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణతో పాటు, ఇటీవల హఠాత్తుగా తెచ్చిన నాలుగు కొత్త లేబర్‌ కోడ్‌లు, ఢిల్లీలో జరిగిన పేలుడు, తదితర అంశాలు చర్చించనున్నారు.

3.యువతలో పోలీసులపై ఉన్న అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం ఉంది: నరేంద్ర మోడీ

పోలీసులపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వృత్తి నిపుణతను, సున్నితత్వాన్ని, ప్రతిస్పందనను పెంచడం ద్వారా దీనిని సాధించాలని సూచించారు. ‘వికసిత భారత్‌ భద్రత కోణాలు’ అనే అంశంపై రాయ్‌పుర్‌లో ముగిసిన అఖిల భారత డీజీపీలు, ఐజీపీల మూడురోజుల సదస్సులో మోదీ ప్రసంగించారు.

4.హుస్నాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో డిసెంబర్ 3న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. హుస్నాబాద్ పట్టణ శివారులోని ఏనె వద్ద మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాటు, జనసమీకరణ కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

5.స్వయంగా పెన్షన్ అందజేయనున్న చంద్రబాబు

ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథ పట్నం గ్రామంలో లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం గొల్లగూడెంలో P4 కార్యక్రమంలో పాల్గొననున్నారు. హెలిపాడ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు సీఎం. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.

6.హైడ్రకు ధన్యవాదాలు తెలిపిన చిన్నారులు

హైదరాబాద్ బాచుపల్లిలో పార్కులు కాపాడినందుకు గాను అక్కడి చిన్నారులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. కాకతీయ కాలనీలో 600 గజాలు, 1500 గజాల రెండు పార్కులను కాపాడినందుకు హైడ్రాకు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది చిన్నారులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.

7.హైదరాబాద్ కి రానున్న ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి

ఇండియా టూర్‌లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్‌ని స్టార్‌ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ సందర్శించనున్నాడు. ఈ పర్యటనలో భాగంగ హైదరాబాద్ RR టీమ్‌తో ప్రత్యేక ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ ఫుట్ బాల్ టీం ప్రాక్టీస్ సెషన్‌కి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. RR9 నెంబర్ జెర్సీ ధరించి ప్రాక్టీస్ సెషన్‌లో సందడి చేశారు.

8.బిర్యానీ తిన్నందుకు స్టూడెంట్స్ ను కొట్టిన ప్రిన్సిపాల్

హాస్టల్‌లోకి బిర్యానీ తెచ్చుకుని తిన్నారని 26 మంది విద్యార్థులను చితకబాదారు ఓ స్కూల్‌ సిబ్బంది. 8వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్‌ చికెన్ బిర్యానీ తిన్నారని క్రమశిక్షణ చర్యల పేరుతో చావబాదాడు ప్రిన్సిపల్. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలూరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.

9.నేవీ డే ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్

డిసెంబర్ 4న నేవీ డే ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు ముందస్తుగా విశాఖలో సర్గమ్ – 2025 ఇండియన్‌ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హాజరయ్యారు. ఆయన వెంట ఆయన కుమారుడు అకీరా నందన్‌ ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు.

10.వ్యవసాయ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలి: తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ వ్యవసాయం- 2047 అగ్రిచాప్టర్‌ను రూపొందించేందుకు సెక్రెటేరియట్‌లో అధికారులతో సమావేశం అయ్యారు.

11.ఫ్లైఓవర్ పై నుంచి పడి వ్యక్తి దుర్మరణం

ఫ్లైఓవర్ పై నుంచి ఓ వ్యక్తి పడి దుర్మరణం పాలైన ఘటన కాచిగూడలో చోటుచేసుకుంది. కాచిగూడ నుంచి అంబర్పేట్ వైపునకు…ఫ్లై ఓవర్ పై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి నెంబర్ చౌరస్తా సమీపంలోకి రాగానే డివైడర్‌ను ఢీ కొట్టాడు. అనంతరం ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్ పక్కకు పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

12.ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ మత్స్యకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

అనుమానాస్పదంగా సముద్రంలో తిరుగుతున్న బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను డి మత్స్యలేశం గ్రామ మత్స్యకారులు పట్టుకొని ఎచ్చెర్ల పోలీసులకు అప్పగించారు. వేట లేని ప్రాంతంలో పడవపై వెళ్తుండగా గమనించి పట్టుకున్నారు.

13.వలూరు గ్రామంలో అధికారులపై అసహనం వ్యక్తం చేసిన నాదెండ్ల మనోహర్

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. సుమారు 580 బస్తాల రైతుల ధాన్యం తరలింపుకు సిద్ధంగా ఉన్నా కూలీలు లేరని అధికారులు చెప్పడంతో ధాన్యం ఎత్తితేనే ఇక్కడి నుంచి వెళ్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ భీష్మించారు. సబ్ కలెక్టర్ సంజన సింహా విషయం తెలుసుకుని అప్పటికప్పుడు 2 లారీలను పంపించగా అత్తోటకు చెందిన 15 మంది జనసేన కార్యకర్తలు బస్తాలను స్వయంగా మోసి లారీలకు ఎక్కించారు.

14.బస్సులో సీటు కోసం గొడవ

ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ జరిగిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. ప్రయాణికుడిని జట్టుపట్టుకుని చితకబాదారు మహిళా ప్రయాణికులు. తాము కర్చీఫ్ వేసుకున్న సీట్లో పురుష ప్రయాణికుడు కూర్చోవడంతో గొడవ ఆరంభమైంది. దాడితో బస్సులోని మిగతా ప్రయాణికులు నివ్వెరపోయారు. ఇది తుని-నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసి బస్సులో జరిగింది.

15.సౌలభ్య పరిపాలన కోసం విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు

ఏపీ పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. విశాఖకు యువరాజ్, అమరావతికి మీనా, రాయలసీమకు కృష్ణబాబు నియమితులయ్యారు.

16.కోడిపందాల పై పోలీసుల వేట

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు ఆడుతున్న 15 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. పందెం రాయుళ్ల నుంచి రెండు కోళ్లు, రెండు కత్తులు, మొబైల్ ఫోన్లు, 18 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

17.యువకుల బైక్ చోరీ కథలు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో 4 బైకులను చోరీకి పాల్పడిన ముగ్గురు దుండగులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటు పడి అప్పుల పాలు కావడంతో యువకులు ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడ్డారు. పలాస నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా దుండగులు పోలీసులకు చిక్కారు.

18.శ్రీలంకలో తూఫాన్ తీసిన ప్రాణాలు: 334

శ్రీలంకలో దిత్వా తుపాను బీభత్సం ధాటికి వరదలు వెల్లువెత్తడం, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 334కి పెరిగింది. మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, శ్రీలంక జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. దాదాపు 11.18 లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని తెలిపింది.

19.అఖండ 2 తో రీ-ఎంట్రీ

పదేళ్ల విరామం తర్వాత అఖండ 2 లాంటి మంచి చిత్రంతో థియేటర్లలోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంది హర్షాలీ మల్హోత్రా. నందమూరి బాలకృష్ణతో కలిసి నటించడం గొప్ప అవకాశమని తెలిపింది. బజరంగీ భాయిజాన్‌లో బాలనటిగా అలరించిన హర్షాలి.. ఇప్పుడు అఖండ 2 తాండవంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఈ నెల 5న థియేటర్లలోకి రానుంది.

20.కింగ్ ఐస్ బ్యాక్

రాంచీలో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లి తన క్లాస్‌ను చాటాడు. ఇటీవల ఫామ్‌లో లేడనే విమర్శలకు తన బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కోహ్లి, ట్రేడ్‌మార్కు షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ ఏకంగా ఏడు సిక్సర్లతో రెచ్చిపోయి, ఫామ్‌ తాత్కాలికం.. క్లాస్‌ శాశ్వతం అని కోహ్లి నిరూపించాడు.

Tags

Related News

Top 20 News: పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన జగదీశ్ రెడ్డి…365 కిలోమీటర్లు పాదయాత్ర…

Top 20 News: జీఓ 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్…సైబర్ క్రైమ్ మోసగాళ్లు అరెస్ట్

History of Karachi Biscuits: కరాచీ బేకరి పాకిస్తానీదా? ఆ పేరు ఎలా వచ్చింది?

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు.. రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక..

Haryana Cashless Treatment: రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం.. హర్యాణాలో కొత్త పథకం!

Chhattisgarh Bomb Blast| ఛత్తీస్ గడ్ లో బాంబు పేల్చిన నక్సల్స్.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి, నలుగురికి గాయాలు

Parenting Tips : మీ పిల్లాడు జెంటిల్‌మెన్ కావాలంటే.. ఈ టిప్స్ చాలు..!

Big Stories

×