Sadha Father Died: హీరోయిన్ సదా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ కన్నుమూశారు. ఈ చేదు వార్తను సదా కాసేపటికి క్రితమే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన తండ్రి మరణావార్తని ప్రకటిస్తూ భావోద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైంది. ఇక ఈ విషయం తెలిసి నటీనటులు ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. కాగా సదా తండ్రి డాక్టర్ అనే విషయం తెలిసిందే. అయితే గతవారం ఆయన చనిపోయినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా తండ్రితో దిగిన ఫోటోని షేర్ చేసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.
“నాన్న చనిపోయి వారం రోజులు అవుతుంది. కానీ, మాకు ఒక యుగంలా అనిపిస్తోంది. నాన్న నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నా కలను నాకు దగ్గర చేయడానికి ఆయన సొంత లైఫ్ని త్యాగం చేశారు. ఆడపిల్లలకు సినిమా సేఫ్ కాదు అనే రోజుల్లోనే ఆయన కుటుంబాన్ని వ్యతిరేకించి నా పక్కన నిలబడ్డారు. ఆ టైంలో మా అమ్మ ప్రభుత్వ ఉద్యోగి. తను నాతో షూటింగ్స్ రాలేకపోయేది. దీంతో నాన్నే కొన్ని రోజుల పాటు నాతో షూటింగ్కి వచ్చేవారు. నా సంరక్షణ కోసం ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇక మా అమ్మ నా బాధ్యత తీసుకున్న తర్వాత ఆయనకు ఎంతో ఇష్టమైన వైద్య వృత్తిని ఎంచుకున్నారు.
తన ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టి నగరంలో చిన్న క్లినిక్ ప్రారంభించి ఎంతోమంది పేదలకు ఉచితం చికిత్స అందించారు. అయితే నేను ఆయన కూతురు కావడం గర్వకారణం అని అంతా ఆయనతో అంటున్నారని అనేవారు. కానీ, ఈ రోజు నేను ఆయన కూతురిగా ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాను. తన చూట్టూ ఉన్నవాళ్ల కోసం ప్రేమ, అప్యాయతలను పంచిన ఆయనను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. మీరు వెలకట్టలేని మనిషి నాన్న. మిస్ యూ సో మచ్” అంటూ సదా తన పోస్ట్లో రాసుకొచ్చింది.
కాగా మహరాష్ట్ర చెందిన సదా తండ్రి ముస్లిం. తల్లి హిందు. వీరిద్దరి ప్రేమ వివాహం. తల్లి ప్రభుత్వ ఉద్యోగి కాగా.. తండ్రి వైద్యుడు. సొంతంగా క్లినిక్ పెట్టి పేద ప్రజలకు వైద్యం అందించేవారు. ముస్లిం ఫ్యామిలీకి చెందిన సదా చిన్న వయసులోని సినిమాల్లోకి వచ్చింది. 2002లో తేజ దర్శకత్వంలో వచ్చిన జయం మూవీతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ప్రాణం, నాగ, దొంగ దొంగది వంటి సినిమాల్లో నటించింది. కొన్నేళ్ల పాటు సినిమాల్లో రాణించిన సదా ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ చేస్తూ.. తన ఫోటోలతో నెటిజన్స్ సర్ప్రైజ్ చేస్తుంది.