ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు, వాటిపై చిరంజీవి స్పందన సంచలనంగా మారడంతో మధ్యలో చలికాచుకోడానికి వైసీపీ సిద్ధమైంది. ఈ వివరణను వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తూ మధ్యలో పవన్ కల్యాణ్ ని తెరపైకి తెస్తోంది. గతంలో పవన్ కల్యాణ్ కూడా బాలయ్య లాగే చిరంజీవిని జగన్ అవమానించారని అన్నారని, అప్పుడే చిరంజీవి ఈ స్టేట్ మెంట్ ఇస్తే బాగుండేదని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.
పవన్ ఏమన్నారు?
జగన్, చిరంజీవిని అవమానించారని బాలయ్య అన్నారు, కాదని చిరు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఐతే గతంలో పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో పవన్ కూడా జగన్ తన అన్నయ్యను అవమానించారని అన్నారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే క్రమంలో సినీ ఇండస్ట్రీ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు పవన్. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, ఇండస్ట్రీ పెద్దలను తన వద్దకు రప్పించుకోవడం కోసమేనని అన్నారు.
చిరుకి అవమానం జరిగిందా?
గత వైసీపీ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్ ని కలిసేందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో జగన్ వారిని కలిసేందుకు ఇష్టపడలేదని, చిరంజీవి గట్టిగా అడగడంతో చివరకు కలిశారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే చిరంజీవి గట్టిగా అడిగారనే మాట అవాస్తవం అని, ఆయనకు అవమానం జరిగిందనే మాట మాత్రం వాస్తవం అని కరెక్షన్ చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల సమయంలో కూడా పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారిని జగన్ అవమానించారన్నారు. ఈ వ్యాఖ్యలకు సాక్ష్యంగా అప్పట్లో చిరంజీవి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. చేతులు జోడించి అడుగుతున్నాను అంటూ చిరంజీవి జగన్ వద్ద చేసిన ప్రస్తావన సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్ వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.
వైసీపీ కొత్త పల్లవి
అవమానం జరగలేదని, తాను మర్యాద ఇచ్చి పుచ్చుకుంటానంటూ తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా ఇ్పపుడు వైరల్ గా మారాయి. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు వైసీపీ రెడీగా ఉంది. నిన్న మొన్నటి వరకు సీఎం చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ కి మర్యాద తక్కువైందని విమర్శించిన వైసీపీ నేతలు, నేడు కొత్త పల్లవి అందుకున్నారు. పవన్ కల్యాణ్ వద్ద తన బావ పరపతి తగ్గిపోతోందని, అందుకే బాలకృష్ణ మెగా కుటుంబాన్ని టార్గెట్ చేశారని వైసీపీ నేతలంటున్నారు. మొత్తానికి కూటమిలో రచ్చ లేపేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందుకే బాలయ్య వ్యాఖ్యలు, చిరు వివరణకు మధ్య ఓజీని బలవంతంగా తెచ్చి పెడుతున్నారు వైసీపీ నేతలు.
వాట్ నెక్స్ట్..?
బాలయ్య వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించినవి కావని టీడీపీ నేతలు అంటున్నారు. కాదు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం కోసమే బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ మీడియా, అనుకూల సోషల్ మీడియాలో కూడా ఇవే కథనాలు వండి వారుస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కూటమి నేతలు లైట్ తీసుకుంటారా లేక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారా, వేచి చూడాలి.