Allu sirish: అల్లు వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడున్నాడని టాలీవుడ్ ల వార్తలు గుప్పుమన్నాయి. అల్లు అర్జున్ తమ్ముడిగా గౌరవం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు అల్లు శిరీష్. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా శిరీష్ నిరుత్సాహ పడకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి సినిమాలతో హీరోగా ఒక మోస్తరు విజయాలను అందుకున్నా కూడా స్టార్ హీరోగా ఎదగడానికి శిరీష్ ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. ఒక ఇంటి నుంచి వచ్చిన ఇద్దరు హీరోల్లో ఒక హీరో పాన్ ఇండియా స్టార్ అవ్వగా ఇంకొక హీరో ఇలా విజయాల కోసం స్ట్రగుల్స్ పడడం కొద్దిగా విచిత్రంగా ఉన్నా కూడా శిరీష్ ఇప్పటికీ అలాంటి ట్రోల్స్ ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. అన్న అంత గొప్పగా కాకపోయినా కనీసం హీరోగా ఆయన నిలదొక్కుకోవాలని తన వంతు ప్రయత్నం తాను చేస్తూ వస్తున్నాడు.
గత ఏడాది బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శిరీష్. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం శిరీష్ ఒక మంచి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడని టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొడుకు లక్కు కలిసి రావడానికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అల్లు అరవింద్.. శిరీష్ కు ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.
హైదరాబాదులోని ఒక బిజినెస్ మాన్ కుమార్తెను శిరీష్ కోసం చూశారట. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని తెలుస్తుంది. నిశ్చితార్థం పెట్టుకునే సమయంలోనే అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మరణించారు. దీంతో ఈ శుభకార్యానికి బ్రేకులు పడ్డాయని సమాచారం. ఇక ఇంట్లో చావు జరిగిన తర్వాత శుభకార్యం చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అల్లువారింట ఆ శుభకార్యం శిరీష్ నిశ్చితార్థం అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. త్వరలోనే నిశ్చితార్థం ముహూర్తం ఖరారు చేసి అతికొద్ది బంధుమిత్రుల సమక్షంలోనే శిరీష్ ఎంగేజ్మెంట్ చేయనున్నారని టాక్ నడుస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. పెళ్లి తర్వాత అయినా శిరీష్ హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.