Ameesha Patel: 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘బద్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమీషా అమిత్ పటేల్ (Ameesha Amith Patel) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మహారాష్ట్ర ముంబై కి చెందిన ఈమె ఈ వయసులో కూడా తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది.
తెలుగులో బద్రి తర్వాత నాని, నరసింహుడు, పరమవీరచక్ర అంటూ పలు చిత్రాలు చేసిన ఈమె.. ఆ తర్వాత హిందీలోనే సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తోంది. అలాంటి ఈమెకు తాజాగా భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వార్తలు రాగా.. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2017లో ఒక ఈవెంట్ నిర్వహించగా.. ఈవెంట్ నిర్వహకుడు పవన్ వర్మ 16 నవంబర్ 2017న జరిగిన ఒక వివాహంలో ప్రదర్శన కోసం అమీషాకు రూ.14.50 లక్షల అడ్వాన్స్ ఇచ్చారట. అలాగే మొరాదాబాద్ లోని ఢిల్లీ రోడ్డులోని ఒక లగ్జరీ హోటల్లో ఆమె కోసం బస కూడా ఏర్పాటు చేశారు. అయితే చివరి నిమిషంలో అమీషా పటేల్ ఈవెంట్లో పాల్గొనడం లేదు అంటూ పవన్ వర్మకు షాక్ ఇచ్చింది.
ఆ తర్వాత ఆమె తనకు పవన్ వర్మ ఇచ్చిన పూర్తి డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చింది. కానీ 10 లక్షలు నగదు రూపంలో తిరిగి ఇచ్చి మిగిలిన 4.50 లక్షలకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్ట్ ను ఆశ్రయించారు. దీంతో కేసును విచారించిన జూనియర్ డివిజన్ కోర్టు నుంచి పలుమార్లు ఆమెకు సమన్లు జారీ చేసింది. అయినా అమీషా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో తాజాగా కోర్టు ఆమె హాజరును నిర్ధారించడానికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ALSO READ:Rukmini Vasanth: జోరు పెంచిన రుక్మిణీ వసంత్.. ఏకంగా బడా ప్రాజెక్టుల్లో అవకాశం!
దీనిపై అమిత్ న్యాయవాది అభిషేక్ వర్మ స్పందించారు. “ఈ విషయం 2017 నాటిది అప్పట్లోనే ఒప్పందం ప్రకారం ఈ సమస్య పరిష్కారం అయ్యింది. అమీషా పవన్ వర్మాకు పూర్తి మొత్తాన్ని తిరిగి ఇచ్చిందని” తెలిపారు. అయితే ఇప్పుడు ఈ వివాదంపై తాజాగా అమీషా పటేల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “పవన్ వర్మతో 2015లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సెటిల్మెంట్ పూర్తయింది. ఈ మేరకు పవన్ వర్మ కూడా డీడ్ పై సంతకం చేశారు.
తను అంగీకరించిన మొత్తాన్ని నేను ఆయనకి ఎప్పుడో చెల్లించాను. అయినప్పటికీ కూడా అతను ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నా తరఫు న్యాయవాదులు అతను నాపై చేస్తున్న మోసానికి తగిన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతున్నారు. కనీసం ఇప్పటికైనా పవన్ వర్మ ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేయడం మానుకోవాలి” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం అమీషా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.