Anirudh Wedding:అనిరుధ్ రవిచందర్.. తనదైన మ్యూజిక్ తో దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ని ఊపేస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రముఖ వ్యాపారవేత్త, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేతల్లో ఒకరైన కావ్య మారన్‌ను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.మొత్తానికి ఎట్టకేలకు నవంబర్ 11న ఈ జంట ఒక్కటైంది. గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ప్రశాంతంగా జరిగిందని తెలుస్తుంది.
ఇక తన పెళ్లి విషయాన్ని అనిరుధ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం విశేషం. ‘My once in a lifetime, for a lifetime 11.11’ అంటూ క్రేజీ క్యాప్షన్ యాడ్ చేసి పెళ్లి ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో అనిరుధ్ ఐవరీ కలర్ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తే, కావ్య మారన్ లేత గులాబీ రంగు డిజైనర్ డ్రెస్‌లో మెరిసిపోయిందనే చెప్పాలి. ఇక చుట్టూ తెలుపు, పసుపు రంగు పూల డెకరేషన్, గాల్లో ఎగిరే పూలరేకుల మధ్య కనిపించిన ఈ జోడీ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది.ముఖ్యంగా 11.11 అనే స్పెషల్ డేట్ న వీరిద్దరు పెళ్లి చేసుకోవడం మరింత స్పెషల్ గా మారిపోయింది.
ఇక ఈ పెళ్లి వేడుక గ్రీస్‌లో రెండు రోజుల పాటు ఘనంగా సాగిందని తెలుస్తుంది. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం విశేషం.ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కుటుంబంతో సహా గ్రీస్‌కు వెళ్లి ఈ వేడుకలో పాల్గొనడం మరో విశేషం.ఇక తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారని సమాచారం.
ఇక నవంబర్ 21న చెన్నైలో అత్యంత వైభవంగా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఈ వేడుకకు దక్షిణాది, బాలీవుడ్ నుంచి ఏఏ ప్రముఖులు వస్తారో అన్న క్యూరియాసిటీ ఇప్పుడే మొదలైపోయింది.
ఇక అనిరుధ్ మ్యూజిక్ జర్నీ విషయానికి వస్తే చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన ఆయన, తొలి సినిమా ‘3’తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. అందులోని ‘వై దిస్ కొలవెరి డి’ పాట ఎంత పాపులర్ అయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఆయన చేసిన ‘వేలై ఇల్లా పట్టధారి’, ‘కత్తి’, ‘మారి’, ‘వేదాళం’, ‘పేట’, ‘మాస్టర్’, ‘డాక్టర్’, ‘బీస్ట్’, ‘విక్రమ్’, ‘జైలర్’, ‘లియో’, ‘జవాన్’, ‘దేవర’, ‘కూలీ’ వంటి వరుస భారీ చిత్రాలకు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించి తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు.
ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ‘జైలర్’లోని హుకుం పాట, ‘లియో’ థీమ్ మ్యూజిక్, ‘జవాన్’ బీట్స్ థియేటర్లలో ప్రేక్షకులను పూనకాలు తెప్పించాయనే చెప్పాలి. ఇక తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’, ‘దావూది’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి కూడా. ప్రస్తుతం దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు అందరు పెద్ద స్టార్ల సినిమాలకు ఆయనే మొదటి ఛాయిస్‌గా మారాడనడంలో సందేహం లేదు.మొత్తానికి ఎన్నాళ్లగానో వార్తల్లో నిలిచిన వీరిద్దరూ ఎట్టకేలకి ఒక్కటి కావడంతో మురిసిపోతున్నారు అభిమానులు !