Babu Mohan:బాబు మోహన్..ఇంత కూరుంటేయమ్మో అంటూ ఒక్క పాటతోనే తెలుగు రాష్ట్రాలని షేక్ చేసిన ఈ క్రేజీ వెటరన్ కమెడియన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా తన కాంబోలో ఎన్నో సినిమాలు నటించి అలరించిన కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధం గురించి అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తాను ఎందుకు ఎక్కువగా సినిమాలు చేయలేదనే విషయన్ని ఇలా వివరించారు.
కోట చనిపోవడానికి ముందు రోజు
బాబు మోహన్ మాట్లాడుతూ . కోట శ్రీనివాసరావు తనతో పాటు నటించే కో ఆర్టిస్ట్ గానే కాకుండా ,ఒక ఆత్మీయుడిగా, కుటుంబ సభ్యుడిగా భావించేవారని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా కోట తన చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిపోయారు.కోట చనిపోవడానికి ముందు రోజు సాయంత్రం చాలా రోజులైందని, ఒకసారి ఇంటికి వచ్చి కలవాలని కోట ఆప్యాయంగా పిలిచారని ఆరోజుని గుర్తు చేసుకున్నారు.
దానికి తను తెల్లారి ఉదయం 10 గంటలకు వస్తానని మాట ఇచ్చానని కానీ తెల్లారగానే ఇలా కోటన్న మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని కన్నీరు పెట్టుకున్నారు.తాను కలవడానికి వెళ్లాలని అనుకున్న వ్యక్తిని ఇక ఎప్పటికీ చూడలేననే బాధ తనలో మిగిలిపోయిందని వాపోయారు.
ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు!
ఇక ఈ క్రమంలోనే షూటింగ్ చేసే టైం లో వాళ్ల మధ్య ఎలాంటి సరదా సంఘటనలు జరిగేవో సరదాగా చెప్పుకొచ్చాడు. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం, కోట శ్రీనివాసరావు తనకు స్వయంగా ముద్దలు కలిపి పెట్టడం వంటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఇక ‘మాయలోడు’ సినిమా షూటింగ్ సమయంలో కోట తనకు ఎంతగానో సహకరించేవాడని,తనను ఇబ్బందిపెట్టకుండా, తన సౌకర్యాన్ని అర్థం చేసుకుని సహాయం చేసేవారని ఆరోజుల్ని గుర్తుచేసుకున్నారు.
ఇక మాయలోడు సినిమా సమయంలో సౌందర్యని దగ్గరగా చూసిన బాబు మోహన్ ఆమె టాలెంట్ ని గుర్తించి అమ్మోరు సినిమా కోసం స్వయంగా తనే రికమెండ్ చేశానని గుర్తు చేసుకున్నారు. తనని చూసి ఆ పాత్రకి సరిగ్గా సరిపోతుందని వెంటనే ఫొటోలు తీయించి, షూటింగ్ పూర్తయిన వెంటనే తిరుపతి నుంచి మద్రాస్‌కు రైలులో వెళ్లి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అందించానని చెప్పుకొచ్చారు.
డబ్బు కంటే కృతజ్ఞతే ముఖ్యం..
ఇక తనకి లైఫ్ ఇచ్చిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణల గురించి మాట్లాడుతూ వాళ్లు తనకు పని ఇచ్చారని, తనను నటుడిగా నిలబెట్టడంలో ఎంతో సహాయం చేశారని.. అలాంటివారి దగ్గర రెమ్యునరేషన్ అడగడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. అయితే నిర్మాతలు చాలాసార్లు డబ్బు తీసుకోవాలని పట్టుబట్టడంతో చివరకు వారి మాటకు గౌరవం ఇచ్చి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆనాటి విషయాలని వివరించారు ఈ క్రేజీ కమెడియన్.
పవన్ కల్యాణ్‌తో ఎక్కువ సినిమాలు
ఇక పవన్ కల్యాణ్‌తో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. సినిమాలలో కలిసి నటించాలా లేదా అనేది తన నిర్ణయం మీద ఆధారపడి ఉండదని,హీరో ,నిర్మాత,దర్శకుల నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు.బహుశా పవన్ కళ్యాణ్ సినిమాలలో తనకి సరిపడా పాత్రలు లేవనే ఉద్దేశంతోనే ఎలాంటి రోల్స్ ఇవ్వకపోవచ్చని తెలిపారు.
కోట శ్రీనివాసరావు అంత్యక్రియల సమయంలో పవన్ కల్యాణ్ తన వెనుక నిలబడి ఉన్నా, ఆయనను మొదట్లో గుర్తించలేదని చెప్పారు. తాను మాట్లాడటం పూర్తయ్యే వరకు పవన్ ఎంతో ఓపికగా ఎదురు చూశారని, ఆ తర్వాత దగ్గరకు వెళ్లి పలకరించానని ఆనాటి రోజులని గుర్తుచేసుకున్నారు బాబు మోహన్ !
ALSO READ :త్రివిక్రమ్‌కు బ్యాడ్ టైమ్ మొదలైందా..‘గాడ్ ఆఫ్ వార్’ లో అంతా కన్ఫ్యూజనే!