The Incomer OTT: ప్రపంచానికి దూరంగా, తమకంటూ ప్రత్యేకమైన ఆచారాలు, నమ్మకాలతో జీవించే వింత మనుషుల కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి ఓ మారుమూల ద్వీపంలోకి ఆధునిక ప్రపంచానికి చెందిన వ్యక్తి అడుగుపెడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో సరదాగా చూపించిన బ్రిటిష్ ఫాంటసీ కామెడీ మూవీ ‘The Incomer’. స్కాట్లాండ్ జానపద కథలు, విచిత్రమైన పాత్రలు, డెడ్‌పాన్ కామెడీ కలగలిపి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. డొమ్నాల్ గ్లీసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి లూయిస్ పాక్స్టన్ దర్శకత్వం వహించారు. విజువల్ క్వాలిటీ, కామెడీ టైమింగ్ పరంగా ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఇంప్రెస్ చేస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ ఓటీటీలో రెంట్ ఆప్షన్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
స్కాట్లాండ్‌లోని ఒక మారుమూల చిన్న ద్వీపంలో ఐస్లా, శాండీ అనే అన్నాచెల్లెళ్లు గత ముప్పై ఏళ్లుగా బయటి ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా ఒంటరిగా బతుకుతుంటారు. చిన్నప్పుడే వీళ్ల అమ్మ జబ్బు చేసి చనిపోవడం, తండ్రి సముద్రంలోకి వెళ్లి ఆత్మత్యాగం చేసుకున్నప్పటి నుండి ముప్పై ఏళ్లుగా బయటి ప్రపంచానికి దూరంగా ఒంటరిగా బతకాల్సి వస్తుంది. బయటి మనుషులను నమ్మొద్దని చెప్పి వాళ్ల నాన్న మాటను బాగా నమ్ముతారు. చిన్నప్పటి నుంచి సముద్రపు పక్షులను వేటాడుతూ, తాము పక్షుల వారసులమని నమ్ముతూ, వింత ఆచారాలతో ఎవరు వచ్చినా కర్రలతో కొట్టి తరిమేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ ద్వీపాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి డేనియల్ అనే ఒక అమాయకపు కౌన్సిల్ ఆఫీసర్‌ని అక్కడికి పంపిస్తుంది.
డేనియల్ ఆ ద్వీపంలో అడుగుపెట్టగానే అన్నాచెల్లెళ్లు అతన్ని కొట్టి కట్టేసి నానా రకాలుగా ఇబ్బంది పెడతారు. కానీ, డేనియల్ తన దగ్గరున్న ఫోన్ చూపించి, తానే ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ కథ రాశానని బిల్డప్ ఇస్తూ అద్భుతమైన కథలు చెప్పడంతో వాళ్లు మెల్లగా అతనికి దగ్గరవుతారు. రోజులు గడిచేకొద్దీ డేనియల్‌కు వాళ్ల అమాయకత్వం, అక్కడి ప్రశాంత వాతావరణం నచ్చుతాయి. మరోవైపు ఐస్లాకు డేనియల్ మీద ఇష్టం ఏర్పడి, అతన్ని పెళ్లి చేసుకుని ఆ ద్వీపంలోనే ఉండిపోవాలని ఆశపడుతుంది. అయితే డేనియల్ మాత్రం బయటి ప్రపంచం అంత చెడ్డదేమీ కాదని, అక్కడికి వస్తే వాళ్ల జీవితం బాగుంటుందని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు.
ఇంతలో డేనియల్ పనిచేయడం లేదని భావించిన అతని బాస్, అన్నాచెల్లెళ్లను బలవంతంగా ఖాళీ చేయించడానికి కాలమ్ అనే కఠినమైన అధికారిని, మరికొందరు సిబ్బందిని ఆ ద్వీపానికి పంపిస్తుంది. వాళ్లు వచ్చి ఐస్లా, శాండీలను బంధిస్తారు. అప్పుడు డేనియల్ పక్షుల వేషంలో వచ్చి, అధికారుల మీద పక్షుల గింజలు చల్లడంతో సముద్రపు పక్షులన్నీ వచ్చి వాళ్లపై దాడి చేస్తాయి. ఆ గందరగోళంలో అన్నాచెల్లెళ్లు తప్పించుకుంటారు. చివరికి భయాన్ని వదిలి కొత్త జీవితాన్ని చూడటానికి ఒప్పుకున్న ఐస్లా, శాండీలు డేనియల్‌తో కలిసి మెయిన్‌ల్యాండ్‌కు వెళ్లిపోతారు. అక్కడ అందరూ కలిసి ఒకే కుటుంబంలా సంతోషంగా జీవించడంతో కథ సుఖాంతమవుతుంది.
డేనియల్ పాత్రలో డొమ్నాల్ గ్లీసన్ నటించగా, ఇస్లాగా గేల్ రాంకిన్, శాండీగా గ్రాంట్ ఓ’రూర్క్ కనిపించారు. ఎమున్ ఇలియట్, మిషెల్ గోమెజ్, జాన్ హన్నా ఇతర కీలక పాత్రల్లో నటించారు. లూయిస్ పాక్స్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 102 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2026 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై NEXT Innovator Award గెలుచుకుంది. 2026న సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట్ కు అందుబాటులో ఉంది.
Read Also: రాణి శరీరంలోకి మగ చెఫ్ ఆత్మ… రాజభవనంలో వంటలతో పాటు రాజకీయాలు కూడా… కొరియన్ ఫాంటసీ కామెడీ డ్రామా