Rajendra Prasad: చిన్నవారైనా.. పెద్దవారైనా.. స్టేజి మీద ఒక మాట ఇస్తున్నామంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే వందసార్లు ఆలోచించాలి.ఇండస్ట్రీ కానీ, ప్రేక్షకులు కానీ , సోషల్ మీడియా కానీ ఒకప్పటిలా లేదు. ఏదో అప్పుడు మాట అన్నాం.. అది జరగలేదు. మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అని అనుకుంటే పొరపాటే. ఒకప్పుడు బండ్ల గణేష్.. తమ పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో కోసుకుంటా అని ఆవేశంతో మాట ఇచ్చాడు. ఆ తరువాత ఆవేశంలో ఏదో అన్నాంలే అని ఆ తరువాత వదిలేయమంటే సోషల్ మీడియా వదిలిందా.. ఇప్పటికీ ఏదో ఒకసారి బండ్లపై ఆ ట్రోల్ నడుస్తూనే ఉంది. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఏదో చేద్దాం.. మైక్ ముందు ఏదో మాట్లాడదాం అని ఇరుక్కుపోతున్నారు.
తాజాగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ పరిస్థితి కూడా లాగే మారింది. నటన విషయంలో ఆయనను కొట్టేవారే లేరు. ఎన్ని సినిమాలు.. ఎన్ని పాత్రలు. హాలీవుడ్ లో సినిమా చేసిన హీరోగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ, ఆ గౌరవాన్ని ఆయనకు ఆయనే తగ్గించుకుంటున్నాడు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకు కారణం ఆయన నోటి దురుసుతనం. ఏదో చిన్నవాళ్లు.. తెల్సినవాళ్ళు అని ఎవరిని పడితే వాళ్ళను.. ఎక్కడపడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి టాపిక్ గా మారుతున్నాడు.
మొన్నటికి మొన్న ఆలీని, ఆ తరువాత రోజాని నోటికి ఎంతమాట వస్తే అంత మాట అనేసి ట్రోల్స్ కి గురయ్యాడు. వాళ్ళు నీకు తెలిసినవాళ్ళే అయినా కూడా పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ పై గౌరవం కలిగిన నటుడు మాట్లాడే పద్దతి కాదు. సరే పెద్దాయన మారతాడు అనుకున్నారు. ఇక మొన్నటికి మొన్న మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి ట్రోల్ అయ్యాడు. ఇలా సినిమాల గురించి స్టేట్మెంట్ లు ఇచ్చి హైప్ పెంచాలని చూస్తున్నారేమో కానీ, అవి ఇండస్ట్రీ పరువు దిగజారుస్తున్నాయి.
రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మాస్ జాతర. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మాస్ జాతర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ సినిమా చూసి షాక్ అవ్వకపోతే .. నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అబ్బో ఈ రేంజ్ లో చెప్పాడు అంటే సినిమాలో విషయం ఉంటుందేమో అని అనుకోని మాస్ జాతర సినిమాకు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు నిజంగానే షాక్ అయ్యాడు. అసలు ఏముంది ఆ సినిమాలో అంత షాక్ అవ్వడానికి.. అదే రొట్ట కొట్టుడు.. అదే రొటీన్ కథ తప్ప అని పెదవి విరిచారు. ఇక ఇప్పుడు నెటిజన్స్ రాజేంద్రప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్ పై పడ్డారు. మాట నిలబెట్టుకోలేకపోయావ్..ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్ నటకిరీటి..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే మాట ఇచ్చేముందు అలోచించి ఇవ్వాలి అని సలహాలు ఇస్తున్నారు.