Fish Venkat Health Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) నటించిన ‘ఆది’ సినిమాతో కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్నారు ఫిష్ వెంకట్. చాలా సినిమాలలో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన ఈయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు దిగజారిపోయింది. గత కొన్ని రోజులుగా కిడ్నీలు రెండు పాడవడంతో హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ రీ ప్లాంటేషన్ కోసం రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో అంత డబ్బు తమ దగ్గర లేదని.. సినీ పెద్దలు ఎవరైనా ఆదుకుంటారని ఫిష్ వెంకట్ భార్య, కూతురు సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్న విషయం తెలిసిందే.
విషమంగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి..
ఇకపోతే గత వారం క్రితం రెండు కిడ్నీలు చెడిపోయాయని లివర్ కూడా డామేజ్ అయిందని.. కండిషన్ సీరియస్ అవ్వడంతో.. వెంటనే ఆయనను వేరే హాస్పిటల్ కి తరలించారు. అయితే ఇప్పుడు మరో ఆశ్చర్యపరిచే విషయం వెలుగు చూసింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఫిష్ వెంకట్ గత మూడు రోజుల నుండి కళ్ళు తెరవట్లేదు. కిడ్నీ తో పాటు లివర్ కూడా డామేజ్ అయ్యాయట. ఆయనను బ్రతికించడం కష్టమని వైద్యులు అంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఎలాగైనా సరే ఫిష్ వెంకట్ ను బ్రతికించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి.. కనీసం ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని పలువురు నెటిజన్స్, అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ప్రభాస్ పేరిట భారీ మోసం..
ఇకపోతే ఫిష్ వెంకట్ కష్టకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో.. ప్రభాస్ పేరిట ఒక కాల్ వచ్చిందట. కిడ్నీ రీ ప్లాంటేషన్ కి అంతా సిద్ధం చేసుకోమని, చికిత్సకు అవసరమైన 50 లక్షలు ప్రభాస్ ఇస్తున్నారు అంటూ ఒక కాల్ వచ్చిందని, మొదట ఫిష్ వెంకట్ కూతురు మీడియాతో వెల్లడించింది. అయితే మళ్లీ తిరిగి అదే నెంబర్ కి ఫోన్ చేస్తే.. స్విచ్ ఆఫ్ వచ్చిందని, అది ఒక ఫేక్ కాల్ అని అర్థమైందని, ఆమె మళ్ళీ మీడియాతో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా ప్రభాస్ పేరిట తమను భారీ మోసం చేశారు అని , కష్టకాలంలో ఇలాంటి మోసాలు అవసరమా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఫిష్ వెంకట్ కూతురు.
అండగా నిలిచిన విశ్వక్ సేన్..
ఇకపోతే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ తన వంతుగా రెండు లక్షల రూపాయలను అందించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్న హీరో అయినా గొప్ప మనసు చేసుకున్నారని మిగతా పెద్ద హీరోలు కూడా స్పందించి ఫిష్ వెంకట్ చికిత్సకు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.