Dhanush:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush )…ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు ఆ సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తూ బిజీగా మారిపోయారు. అంతేకాదు నిర్మాతగా పలు చిత్రాలు కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. దీనిని తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇందులో తన కోరికను బయట పెట్టడంతో ఆ విషయం తెలిసిన సినీ ప్రేక్షకులు” అందుకేనా సార్ మీ ప్రతి సినిమాలో కూడా మీరు అలాంటి పాత్రలు చేస్తున్నారు” అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.
అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ధనుష్.. అందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా తన కోరికను బయటపెట్టారు. ధనుష్ మాట్లాడుతూ..” నాకు చెఫ్ కావాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. దాని ప్రభావం నేను చేస్తున్న ప్రతి సినిమాలో కూడా కనిపిస్తుంది. ‘జగమే తంత్రం’ సినిమాలో నేను పరోటా చేశాను. ‘తిరు’ సినిమాలో డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తాను. అలాగే ‘రాయన్’ సినిమాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా నడిపాను. ఆఖరికి ‘ఇడ్లీ కొట్టు’ సినిమాలో ఇప్పుడు ఇడ్లీ కూడా చేశాను” అంటూ తెలిపారు ధనుష్. అలా తన కోరికను బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరచడంతో నిజమే కదా తన కోరికను సినిమాల ద్వారా తీర్చుకుంటున్నారు ధనుష్ అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?
ఇడ్లీ కొట్టు సినిమా విశేషాలు..
ఇడ్లీ కొట్టు సినిమా విషయానికి వస్తే.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని వండర్ బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఆకాష్ భాస్కరన్, ధనుష్ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించడంతోపాటు హీరోగా కూడా చేస్తున్నారు.. ఇందులో నిత్యామీనన్ (Nithya Menon) మరొకసారి ధనుష్ తో జత కడుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘తిరు’ సినిమా వచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దాంతో మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వీరితోపాటు అరుణ్ విజయ్, సత్యరాజ్ , అలాగే ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన షాలిని పాండే కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగులో వారి ద్వారా రిలీజ్..
ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండగా.. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ, ప్రసన్న జీకే ఎడిటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో శ్రీ వేదా అక్షర మూవీస్ ద్వారా రామారావు చింతపల్లి విడుదల చేస్తున్నారు. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య మరో ఎమోషనల్ రైడ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఇడ్లీ కొట్టు సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.