Poonam Pandey: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పూనమ్ పాండే (Poonam Pandey) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం విమర్శలతో కాలాన్ని వెల్లదీస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరోసారి హిందూ సంఘాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది అనడంలో సందేహం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. రేపటి నుంచి దసరా దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని పురాతన ‘లవకుశ రామ్ లీలా’ కమిటీ పెద్ద ఎత్తున నాటకాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో రావణుడి భార్యగా మండోదరి పాత్రలో పూనమ్ పాండేను నటించమని ఆహ్వానించడం పట్ల హిందూ సంఘాల నుండి ఇప్పుడు వ్యతిరేకత నెలకొంది.
ముఖ్యంగా ఈ విషయంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మతపరమైన, సాంస్కృతిక మనోభావాలను దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఈ మేరకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కమిటీ తన నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.. ఎందుకంటే గతంలో పూనమ్ పాండే ఎన్నో వివాదాలలో చిక్కుకుంది. ఆమెను ఎంపిక చేయడం వల్ల భక్తులలో గందరగోళం నెలకొనడమే కాకుండా భక్తుల ఆగ్రహానికి కూడా దారితీస్తుంది అంటూ ఈ మేరకు హిందూ సంఘాల ప్రాంతీయ మంత్రి సురేంద్ర గుప్తా (Surendra Gupta) కమిటీకి లేఖ కూడా రాశారు.
మండిపడుతున్న హిందూ సంఘాలు..
అందులో ఆయన..” రామ్ లీల కేవలం నాటక ప్రదర్శన మాత్రమే కాదు. భారతీయ విలువలు, సాంప్రదాయాల సముచిత స్వరూపం. రామాయణం ఆధారిత చిత్రాలకు నటీనటుల ఎంపిక కేవలం నటన సామర్థ్యం పై మాత్రమే ఆధారపడి ఉండకూడదు. సాంస్కృతి సముచితత, భక్తుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మా ఉద్దేశం ఏ కళాకారుడిని వ్యక్తిగతంగా వ్యతిరేకించడం కాదు.. కానీ సాంస్కృతిక పవిత్రతను, రామాయణం వంటి పవిత్ర ఇతిహాసాలతో ముడిపడి ఉన్న భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడమే ప్రధాన లక్ష్యం” అంటూ తెలిపారు.
ALSO READ:Dhanush: అదే నా కల.. అందుకే మీ సినిమాలలో ఆ పాత్రలు చేస్తున్నారా సార్!
సద్గుణవతి పాత్ర కోసం…
ఇకపోతే రామాయణం ఇతిహాసంలో మండోదరి పాత్ర చాలా కీలకం. ఆమె సద్గుణవతి ..గౌరవం, సంయమనం, అంకిత భావం తో కూడిన గొప్ప ఆదర్శవంతురాలు. అలాంటి పాత్రకు అలాంటి తరహాలో ఉండే ఒకరిని ఎంపిక చేసుకోవాలని.. ముఖ్యంగా ఈ పాత్రకు నటిని ఎంపిక చేస్తే.. ఆమెలో ఈ ఆదర్శాలు ప్రతిబింబించాలని వారు కోరారు.
పూనమ్ పాండేకి అండగా కమిటీ..
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తో లవకుశ రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ఈమెకు అండగా నిలిచారు.. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం నుండి చెడును తొలగించాలని మేము ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగానే రావణుడి పాత్ర కోసం ఆర్య బబ్బర్ (Arya Babbar) ను తీసుకున్నాము. అలాగే ఆయన భార్య మండోదరి పాత్రను పూనమ్ పాండే పోషిస్తుంది. ఇందులో తప్పేముంది? ఆమె తన ధైర్యమైన నటన అలాగే పాత్రకు మాత్రమే ప్రసిద్ధి చెందింది. ఈ నాటకంతో ఆమె మారిందని, ఆమె అనుచరులకు సందేశం వెళ్తుందని మేము ఆశిస్తున్నాము. మార్పు రావాలి.. చెడు అంతం కావాలి.. ప్రతి ఒక్కరిలో మంచి గెలవాలి ” అని ఆయన తెలిపారు. ఇకపోతే ఈ వివాదం ఇప్పుడు ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.