Kajal Agarwal:సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పురుషులు, మహిళల మధ్య తేడా కనిపిస్తూనే ఉంటుంది. ఒక పురుషుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలో చేస్తున్నా.. లేదా గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చినా.. వారికి వరుసగా అవకాశాలు, హీరోగా స్టార్ డం కచ్చితంగా లభిస్తుంది. కానీ అమ్మాయిలు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టిన తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకుంటే మాత్రం వారిని అమ్మ, అత్త , అక్క , వదిన లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకే పరిమితం చేస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని ఎంతో మంది హీరోయిన్లు బయటపెట్టిన విషయం తెలిసిందే. అందుకే హీరోయిన్లకి లైఫ్ టైం ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తూ ఉంటారు.
ఇకపోతే మరికొంతమంది కెరియర్ లో అవకాశాలు వచ్చినా రాకపోయినా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని కేవలం ఒక రకమైన పాత్రలే చేయాలి అనే నిర్ణయానికి వస్తున్నారు. ఇలా హీరోయిన్లు తీసుకునే నిర్ణయాలు తమ కెరియర్ కు ఇబ్బంది కలిగించినా.. అభిమానులను నిరాశకు గురిచేసినా.. తమ జీవితంలో తాము తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రధాన మెట్టు గా నిలుస్తున్నాయి అనే కామెంట్లు వ్యక్తవుతున్నాయి. ఈ క్రమంలోనే తన అందం, అభినయంతో గ్లామర్ డాల్ గా కనిపించి.. ప్రేక్షకులను అబ్బుర పరిచిన చందమామ అలియాస్ కాజల్ అగర్వాల్ తాజాగా తీసుకున్న కఠిన నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ప్రస్తుతం కాజల్ తన కెరియర్ ను వివాహానికి ముందు.. బిడ్డ పుట్టిన తర్వాత అన్నట్టుగా మార్చుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే కాజల్ అగర్వాల్ తల్లి అయిన తర్వాత తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు సినిమా ఎంపికలలో కొత్త ప్రమాణాలను పాటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ది ఇండియా స్టోరీ తో పాటు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం రామాయణ షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈమె.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, కెరియర్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఈ మేరకు కాజల్ మాట్లాడుతూ..” నేను తల్లి అయిన తర్వాత సినిమాలకు ఓకే చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏ కథ విన్నా సరే ముందు నేను ఒక నటిగా కాకుండా తల్లిగా ఆలోచిస్తున్నాను.నా కొడుకు నీల్ పెద్దయ్యాక నా సినిమాలు చూసి.. ఇది మా అమ్మ చేసిన గొప్ప సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. అందుకే ప్రస్తుతం స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను. కమర్షియల్ అంశాల కోసం కాకుండా మంచి కథ బలమైన పాత్ర , సమాజానికి ఉపయోగపడే సందేశం ఉన్న పాత్రలకే మొదటి ప్రాధాన్య ఇస్తున్నాను అంటూ తెలిపింది.
also read:‘అమ్మ’కి రేవతి, పద్మప్రియ రాజీనామా..అసలేం జరుగుతోంది?
అందులో భాగంగానే చేతన్ డీకే దర్శకత్వంలో ది ఇండియా స్టోరీలో ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా స్టోరీ.. కల్తీ ఆహారం, వ్యవసాయంలో అధికంగా వాడుతున్న పురుగుల మందుల వల్ల ప్రజల ఆరోగ్యం పై పడుతున్న ప్రభావాన్ని చూపించారు. ఇక స్క్రిప్ట్ విన్న తర్వాత ఒక తల్లిగా నేను ఎంతో ఆలోచించాను. ది ఇండియా స్టోరీ షూటింగ్ తర్వాత నా ఇంటి జీవనశైలిలో కూడా మార్పులు చేసుకున్నాను. మా ఇంట్లో వాడే ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను.
నా కొడుకు నీల్ కి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఏది ఇవ్వకూడదు.. అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఒక సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగానే ఈ సినిమా వ్యక్తిగత అవగాహనను కల్పించింది అంటూ ప్రశంసల కురిపించింది. మొత్తానికి అయితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని చెప్పడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేసినా.. తాను ఎంచుకునే కథలు సమాజానికి సందేశాన్ని ఇస్తాయని తెలియడంతో ఈమె నిర్ణయానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.