khushboo:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) TVK పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే యేడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో ఎలాగైనా తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇప్పటినుంచే పలు ర్యాలీలు నిర్వహిస్తూ.. ప్రజలలో నమ్మకం పొందే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు ర్యాలీ నిర్వహించిన విజయ్.. ఇటీవల కరూర్ లో కూడా ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ విజయ్ ను ప్రత్యక్షంగా చూడడానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కానీ ఊహించని రేంజ్ లో ప్రజలు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట జరగగా.. ఊపిరాడక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలా మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. 41 మందికి పైగా గాయపడ్డారు.
అయితే ఈ ఘటనపై ఇప్పుడు తాజాగా ప్రముఖ సినీనటి, బిజెపి నేత ఖుష్బూ (khushboo) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పథకం ప్రకారం క్రియేట్ చేసిన ప్రమాదం అంటూ ఆరోపణలు చేశారు. తొక్కిసలాట.. నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు అంటూ కూడా ఖుష్బూ తెలిపింది. ఖుష్బూ మాట్లాడుతూ.. “ఇది ఎవరో కావాలని సృష్టించిన విపత్తులా ఉంది. విజయ్ కోసం ఎంతమంది అభిమానులు వస్తారో తెలిసిన ప్రభుత్వం సరైన స్థలాన్ని కేటాయించలేదు.. ముఖ్యమంత్రి స్టాలిన్ మౌనం వీడి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి” అంటూ అనుమానాలు రేకెత్తించేలా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
ఇదిలా ఉండగా మరొకవైపు ఈ ఘటనకు విజయ్ సభకు ఆలస్యంగా రావడమే కారణం అంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరొకవైపు విజయ్ కూడా తమ సభకు సరిపడే స్థలం కేటాయించలేదని.. ఇది ప్రభుత్వం చేసిన కుట్ర అని కామెంట్లు చేశారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో కమిటీని కూడా వేసి విచారణ జరుపుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఖుష్బూ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలని ప్రజలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
also read:Kantara: Chapter 1: థియేటర్ లోకి పంజుర్లి దేవుడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!
ఇకపోతే విజయ్ తన పార్టీ ర్యాలీ సభలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని చెప్పిన ఆయన.. తొక్కిసలాటలో మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి సుమారుగా 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి కూడా చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన జననాయగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.