KTR On RTC Charges: జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని సిటీ బస్సు ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచింది. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. సిటీ బస్సు ఛార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
‘పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో, ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికే విద్యార్థుల బస్ ఛార్జీలు, టీ-24 టికెట్ ఛార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస ఛార్జీపై కనికరం లేకుండా 50 శాతం టికెట్ ధరలను పెంచడం ప్రభుత్వ అసమర్థ విధానాలకు నిదర్శనం’ అని కేటీఆర్ విమర్శలు చేశారు.
హైదరాబాద్ వాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ప్రజలపై రేవంత్ సర్కార్ కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోందన్నారు. విఫలమైన ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని గట్టెక్కించాల్సిందిపోయి, సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం సరికాదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారనే కసితోనే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పాలన వలన రాష్ట్ర ప్రగతి రథచక్రాలే కాదు, చివరికి ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు సైతం ధ్వంసం అయ్యాయని కేటీఆర్ విరమ్శించారు. కాంగ్రెస్ సర్కారును కుప్పకూల్చే వరకూ వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.
హైదరాబాద్ సిటీ బస్సుల ఛార్జీల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘సామాన్య ప్రజలంటే ఎందుకింత కోపం. మొన్నటికి మొన్న సిటీ బస్ పాస్ ల ధరలు భారీగా పెంచి చిరుద్యోగులు, నగర ప్రజలపై పెనుభారం మోపారు. ఇప్పుడు బస్ ఛార్జీలను అమాంతం పెంచేశారు.. బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు’ అని కవిత ఎక్స్ వేదికా విమర్శలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే సిటీ బస్సుల టికెట్ల రేట్ల టీజీఎస్ఆర్టీసీ పెంచింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సులలో మొదటి మూడు స్టేజీలకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి చివరి వరకు రూ.10 అదనపు ఛార్జీలు విధించింది. మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి చివరి వరకు రూ.10 అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
పెంచిన ఛార్జీలు అక్టోబర్ 6వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 25 డిపోలున్నాయి. వీటిలో 265 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. ఈ ఏడాది మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నారు.
Also Read: Cough Syrup: ఆ దగ్గు మందు వాడొద్దు.. తెలంగాణ డీసీఏ ఆదేశాలు
ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఒక్కో డిపోలో రూ.8 కోట్ల వ్యయంతో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2027 నాటికి మొత్తం 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం 19 డిపోల్లో ఛార్జింగ్ హెచ్‌టీ కనెక్షన్లు అవసరం ఉంటుంది. అలాగే కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేయనున్నారు.