Kota Srinivas Rao Demise: కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao).. విలక్షణ నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం ఒక్క సినీ పరిశ్రమనే కాదు యావత్ సినీ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక విలక్షణ నటుడిని, వెలకట్టలేని గొప్ప వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పవచ్చు. ఈరోజు ఆయన మరణించడంతో ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే కోటా శ్రీనివాసరావు.. బాబు మోహన్ (Babu Mohan) మధ్య స్నేహాన్ని కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలను కూడా నెమరు వేసుకుంటున్నారు. మరి వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తిరుగులేని జోడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు మోహన్ – కోటా శ్రీనివాసరావు..
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ కి తిరుగులేదు. మొదట కోట శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాలి అంటే.. విలనిజంలో రాజసం.. హాస్యం పండించడంలో పెద్దరికం.. క్యారెక్టర్ లో 24 క్యారెట్ల మేలిమి పనితనం ఉంటాయి. అటు హాస్యం, ఇటు ఎమోషనల్ రెండింటిని పండించగలిగే అరుదైన నటుడు కోటా శ్రీనివాసరావు.. మరొకవైపు బాబు మోహన్ విషయానికి వస్తే.. కామెడీతో పాటు విలనిజాన్ని కూడా తనదైన శైలిలో పండించడం ఈయన గొప్పతనం. అలాంటి ఇద్దరు కలిసి చేసిన కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
బాబు మోహన్ – కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు..
అలా మొదటిసారి సారి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘బొబ్బిలి రాజా’. బి.గోపాల్ (B.Gopal) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh ) హీరోగా వచ్చిన ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఆ తర్వాత ఎక్కువగా వీరిద్దరూ.. ఈవీవీ సత్యనారాయణ (EVV Satyanarayana), ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) వంటి దర్శకుల చిత్రాలలో ఎక్కువగా కలసి నటించారు. ముఖ్యంగా వెండితెరపై తమ జోడికి తిరుగులేదు అనిపించుకున్నారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో.. హలో బ్రదర్, వారసుడు, అల్లరి అల్లుడు, ఇన్స్పెక్టర్ అశ్విని, సీతారత్నం గారి అబ్బాయి, మామగారు, పెదరాయుడు, పరదేశి, మాయలోడు, అప్పుల అప్పారావు, జంబలకడిపంబ ఇలా దాదాపు 60కి పైగా చిత్రాలలో జోడిగా నటించారు.
ఇండస్ట్రీకి బెస్ట్ ఛాయిస్ గా నిలిచిన బాబు మోహన్ – కోట కాంబో
ఇక చాలా సినిమాలలో కోట శ్రీనివాసరావు బాస్ గా నటిస్తే.. బాబు మోహన్ ఆయన అసిస్టెంట్గా నటించారు. అయితే ఒక మాయలోడు సినిమాలో మాత్రమే కోట శ్రీనివాసరావు తండ్రిగా బాబు మోహన్ కొడుకుగా కనిపించారు. వీరిద్దరి కాంబినేషన్ గురించి చెప్పాలి అంటే.. వీరు లేని సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి సినిమా అయినా సరే కచ్చితంగా వీరిద్దరి కాంబో ఉండి తీరాల్సిందే. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాల్సిందే.
ఆన్ స్క్రీన్ పై గొప్ప జోడి.. యాదృచ్ఛికంగా ఇద్దరి జీవితంలో ఒకటే విషాదం..
అంతలా ఆన్ స్క్రీన్ జోడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఆన్ స్క్రీన్ పై ఎంతలా ప్రేక్షకులను మెప్పించారో.. ఇటు నిజ జీవితంలో యాదృచ్ఛికంగా వీరిద్దరి కుమారులు కూడా యాక్సిడెంట్ లో కన్నుమూయడం విషాదకరమని చెప్పాలి. ఇక ఇద్దరికీ కూడా దేవుడు ఒకే బాధను మిగిల్చారని ఎప్పుడూ ఈ వీరిద్దరూ బాధపడుతూనే ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య పది సంవత్సరాలు తేడా ఉన్నా ఇద్దరు మాత్రం తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు.
కోట మరణంతో కన్నీటి పర్యంతమవుతున్న బాబు మోహన్..
ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఈ జంట నుండి ఒకరు దూరం అవ్వడంతో ఇంకొకరు తట్టుకోలేకపోతున్నారు. అలా కోట మరణ వార్త విని బాబు మోహన్ కన్నీటి పర్యంతమవుతున్నారు. బాబు మోహన్ మాట్లాడుతూ.. “నిన్న రాత్రి కూడా కోటా తో మాట్లాడాను. ఆయన మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది” అంటూ తెలిపారు.