Rishab Shetty:కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ (IFFM) 2026 లో ఆయనకు ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డు లభించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ పరిధిని, గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ఆయన చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..
కన్నడ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రిషబ్ శెట్టి ‘కాంతార’ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఇక కర్ణాటక తీరప్రాంత ఆచారాలు, జానపద సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుండెకు హత్తుకునే మానవ భావోద్వేగాలతో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులను మంత్రముగ్ధులను చేశారు.
‘కాంతార’ సాధించిన అద్భుత విజయం తర్వాత ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక నటుడిగా, దర్శకుడిగా ఆయన చూపించిన అపూర్వమైన ప్రతిభతో ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లారని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
also read:బాబాయ్ రిక్వెస్ట్.. రంగంలోకి ప్రభాస్, ఘట్టమనేని వారసుడికి సపోర్ట్ మామూలుగా లేదుగా!
ఆస్ట్రేలియాలో జరగబోయే ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 2026 వేడుకల్లో రిషబ్ శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఇక ఆగస్టు 13న జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ‘కాంతార’ స్టార్‌కు ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్ యాజమాన్యం ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ అవార్డును అధికారికంగా ప్రదానం చేయనుంది.
ఈ అవార్డు ప్రకటనపై నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందిస్తూ తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. “మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడమే నాకు కథలు చెప్పడంలో ఉన్న అసలైన ఆనందం. మన మూలాలకు సంబంధించిన కథలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు నచ్చడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఇక మెల్‌బోర్న్ వేడుకల్లో పాల్గొని భారతీయ సినిమా గొప్పదనాన్ని అందరితో కలిసి పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘జై హనుమాన్’లో కీలక పాత్రలో కనిపిస్తున్న రిషబ్ శెట్టి, మరోవైపు ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఈ రెండు గ్రాండ్ ప్రాజెక్టులు వచ్చే ఏడాది థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
సొంత మట్టి సువాసనలు, సంస్కృతి ఆధారంగా కథలను రాసుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం రిషబ్ శెట్టికే చెల్లింది. ఇక గ్లోబల్ వేదికపై ఆయనకు దక్కిన ఈ గౌరవం పట్ల దక్షిణాది సినీ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.