Vijay Jana Nayagan: రాజకీయాల్లోకి పూర్తిస్థాయి ఎంట్రీ ఇచ్చేముందు.. విజయ్ చివరి చిత్రంగా వస్తున్న సినిమా.. జన నాయగన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సమస్యల వల్ల ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై వాదనలు పూర్తయ్యాక..కోర్టు తన తీర్పును నిలిపివేసింది.
ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి మనింద్ర మోహన్ శ్రీవాస్తవ.. న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సీబీఎఫ్‌సీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఏఆర్.ఎల్. సుందరేశన్ వాదనలు వినిపించగా..సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తరఫున సీనియర్ న్యాయవాది సతీష్ పరాసరన్ వాదించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేయకుండా..హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించడంతో వాదనలు మంగళవారం పూర్తయ్యాయి.
ఈ వివాదం ఎలా మొదలైంది అంటే… డిసెంబర్ 19, 2025న సీబీఎఫ్‌సీ పరిశీలనా కమిటీ సినిమా చూసి, కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వవచ్చని ఏకగ్రీవంగా సూచించింది. ఈ నిర్ణయాన్ని డిసెంబర్ 22న నిర్మాతలకు తెలియజేశారు. నిర్మాతలు సూచించిన అన్ని కట్స్‌ను పూర్తి చేసి..డిసెంబర్ 24న సవరించిన వెర్షన్‌ను తిరిగి సమర్పించారు.
అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, డిసెంబర్ 29న ప్రక్రియను నిలిపివేశారు. కారణం ఏమిటంటే… పరిశీలనా కమిటీలో సైన్యానికి సంబంధించిన నిపుణుడు లేడని పేర్కొంటూ, అదే కమిటీకి చెందిన ఒక సభ్యుడు ఫిర్యాదు చేయడం. ఆ ఫిర్యాదు ఆధారంగా జనవరి 5, 2026న సినిమా ను తొమ్మిది మంది సభ్యులతో కూడిన రివైజింగ్ కమిటీకి పంపాలని సీబీఎఫ్‌సీ ఛైర్మన్ నిర్ణయించారు.
దీంతో నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ పి.టి. ఆశా సీబీఎఫ్‌సీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా చూసి, మార్పులు సూచించిన వ్యక్తే మళ్లీ ఫిర్యాదు చేయడం అనుమానాస్పదమని ఆమె వ్యాఖ్యానించారు. ఇది తరువాత వచ్చిన ఆలోచనలా, ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యలా కనిపిస్తోందని పేర్కొన్నారు.
అలాంటి చర్యలు కొనసాగితే, సీబీఎఫ్‌సీ పరిశీలనా కమిటీల నిర్ణయాలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని జస్టిస్ ఆశా అన్నారు. ఈ కారణాలతో సీబీఎఫ్‌సీ ఛైర్మన్ నిర్ణయాన్ని రద్దు చేసి, వెంటనే U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు.
ఈ ఆదేశాలపై సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. ఆ స్టేను నిర్మాతలు సుప్రీంకోర్టులో సవాల్ చేసినా, అక్కడ జోక్యం చేయలేదు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు తుది తీర్పుపై సినిమా వర్గాలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.