Gudem Mahipal Reddy: కాంగ్రెస్లో చేరిన పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి యూ టర్న్ తీసుకుంటున్నారట. ఆయన హస్తం పార్టీకి హ్యండ్ ఇచ్చి తిరిగి కారు ఎక్కే టైం ఇక ఎంతో దూరంలో లేదంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మనసులో మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీపార్టీని గెలిపించడానికి కృషి చేస్తానంటున్నారు.. అసలు మహిపాల్‌రెడ్డి ఎందుకంత సడన్‌గా అలాంటి నిర్ణయం తీసుకున్నారు?.. ఆయన తీరుపై పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఏంటి?
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో 2024 జూలై 15న అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏ ముహుర్తాన ఆయన కాంగ్రెస్‌లో చేరారో కానీ ఆయన అటు ఇటు ..ఎటూ కాకుండా అయిపోయారనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోంది. స్థానిక కాంగ్రెస్ నేతలతో సఖ్యత లేకపోవడంతో ఎమ్మెల్యే నామ్ కే వాస్తేగా తయరయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ నాయకులు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు చేశారని ఆయనపై ఫైర్ అవుతున్నారు. దీంతో ఆయన ఏకాకిలా మిగిలిపోయారని ఎమ్మెల్యే వర్గీయులు మదనపడాల్సి వస్తోంది.
అయితే గత కొన్నిరోజులుగా ఆయన వ్యవహర శైలి అంతుపట్టకుండా తయారైంది. బీఆర్ఎస్ ఫ్లెక్సీలో తన ఫోటోలపై చర్చకు తెరలేపిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒక్కసారిగా తన మనసులో మాటను అనుచరుల ముందు కుండబద్దలు కొట్టారట. మున్నిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పటడుగు వేశానని వాపోయారంట. ఆ పార్టీలో చేరితే వెంట్రుక వాసి కూడా లాభం జరగలేదని, మూడు సార్లు తనని ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ గెలిపించిందని ఆ పార్టీపై పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని అనుచరులకు మార్గదర్శకం చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాం రాం చెబుతారని గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇమడలేక తనని మూడు సార్లు గెలిపించిన కారుని మళ్లీ ఎక్కుదామని ఫిక్స్ అయ్యారని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే తనతో పాటు కాంగ్రెస్లో చేరిన కొంతమంది తన అనుచరులను ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుస్తున్నారంట. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టైంలో బీఆర్ఎస్ సమావేశాల్లో ప్రత్యక్షమయ్యారు. దాంతో మొదట ఆయన సోదరుడు, అనుచరులు కారు పార్టీ స్టీరింగ్ పట్టాక తాను వెనుక సీట్లో కర్చీఫ్ వేద్దామనుకున్నారట.
ఈ ఎపిసోడ్ తో స్థానిక కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రంగుబయటపడిందని మండిపడుతున్నారు. అసలు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసుల నుంచి బయటపడటానికని.. పార్టీని ఖతం చేయడానికే మహిపాల్ రెడ్డి వచ్చారని నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అప్పట్లోనే ఆరోపించారు. తీరా మున్సిపల్ ఎలక్షన్ టైంలో మహిపాల్ రెడ్డి అధికార పార్టీని బదనాం చేయడానికే ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మొదటి నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విషయంలో కాట శ్రీనివాస్‌గౌడ్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మహిపాల్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగిందంట. ఇప్పటికే తనకి అనూకూలంగా ఉన్న అధికారులను ఇక్కడ పోస్టింగ్ లు ఇప్పించుకున్నారంట. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సమయంలో ఆయన వాయిస్ మార్చడం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో కత్తి మహిపాల్ రెడ్డికి ఇచ్చి యుద్దం తనని చేయమంటే ఎలా అని కాంగ్రెస్ నాయకులతో కాట శ్రీనివాస్‌గౌడ్ వాపోతున్నారట. ఆ క్రమలో కార్యకర్తలు కూడా అధిష్టానం ఏదో ఓ నిర్ణయం తీసుకుని పటాన్ చెరుపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.
అదలా ఉంటే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత నియోజకవర్గ బీఆర్ఎస్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదర్ష్ రెడ్డి గందరగోళంలో పడిపోయారట. మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి తిరిగి వస్తే తన స్థానమేంటోనని ఆందోళన చెందుతున్నారంట. ఓ వైపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుంటే పార్టీ మారిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమపై పెత్తనం చెలాయించాలని చూడటం ఏంటని నిఖార్సైన బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
మొత్తంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కామెంట్స్ అటు అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆరా్ఎస్ లోనూ చర్చనీయాంశంగా మారాయి. మరి ఎమ్మెల్యే కేవలం కామెంట్స్ తోనే సరిపెట్టుకుంటారా… లేదా కారెక్కుతారా అనేది తేలాల్సి ఉంది. మైహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలతో తన రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చూసుకోవడానికే కాంగ్రెస్ పార్టీకి గుడ్బయ్ చెప్పి కారు ఎక్కడానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆయనపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి పటాన్‌చెరులో నెలకొంది. మరి మహిపాల్‌రెడ్డి తిరిగి గులాబీ కండువా కప్పుకోవడానికి రెడీ అయితే . ఆ పార్టీ నేతలు స్వీకరిస్తారా? రిజెక్ట్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Story by: Apparao, Big Tv