Malavika Mohanan..సినిమా ఇండస్ట్రీలో పక్షపాతం చూపిస్తున్నారు అని, ముఖ్యంగా హీరోలను ఒకలాగా.. హీరోయిన్లను ఇంకోలాగా చూస్తున్నారని, ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ తమ బాధను వెల్లబుచ్చుకున్నారు. ముఖ్యంగా పారితోషకం విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారని, హీరోయిన్లు అడిగితే మాత్రం వారిని సినిమా నుండి తీసివేయడం లేదా అడిగిన దానికంటే తగ్గించి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సమంత (Samantha) కూడా ఈ విషయంపై నోరు విప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ‘శుభం’ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు సమానంగా పారితోషకం ఇచ్చి.. కొత్తపుంతలు తొక్కింది.
ఇండస్ట్రీలో పక్షపాత ధోరణి మారాలి – మాళవిక
అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) కూడా సమంతా దారిలోనే నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక భేటీలో పాల్గొన్న మాళవిక మాట్లాడుతూ నిర్మొహమాటంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బహిర్గతం చేసింది. మాళవిక మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమలో ఆడ, మగ అనే తేడా ఉండకూడదు. ఇలాంటి తారతమ్యం ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నటులకు లభించే మర్యాద నటీమణులకు లభించడం లేదు. పారితోషకం విషయంలో కూడా సమానత్వం లేదు. హీరోలకు అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. కానీ హీరోయిన్లకు అడిగినంతలో తగ్గించి ఇస్తున్నారు. ఇండస్ట్రీలో మొదట ఈ పక్షపాత ధోరణి మారాలి. ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఉన్నారు. బయటకి మంచివారిలా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు వారి అసలు రంగు బయటపడుతుంది.
కెమెరా ముందు ఒకలా.. కెమెరా వెనుక ఒకలా ఉంటారు – మాళవిక
గత ఐదు సంవత్సరాలుగా నేను చాలామంది నటులను చూశాను. వీరంతా సినిమా ఇండస్ట్రీలో కెమెరా ముందు ఒకలాగా.. కెమెరా వెనుక ఒకలాగా కనిపించడం నేను ప్రత్యక్షంగా అనుభవించాను కూడా. అందుకే బయటకి మనతో మంచిగా కనిపించే వారి నిజస్వరూపాన్ని అంత త్వరగా తేల్చలేము. ఇండస్ట్రీలో ముఖ్యంగా నటులతో ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది”. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మాళవిక మోహనన్. ఇకపోతే ఈమెకు ఏ సందర్భంలో ఎక్కడ ఏ ఇండస్ట్రీలో ఇలాంటి చేదు అనుభవం ఎదురయిందో తెలియదు కానీ.. తన బాధ మొత్తాన్ని ఒకేసారి బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక పారితోషకం విషయంలో సమంత లాగే మాళవిక మోహనన్ కూడా మాట్లాడింది. మరి ఇప్పటికైనా ఇండస్ట్రీ నిర్మాతలు వీరి మాటలను పరిగణలోకి తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాళవిక మోహనన్ సినిమాలు..
ఇక మాళవిక మోహనన్ సినిమాల విషయానికొస్తే. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) , మారుతి(Maruthi ) కాంబినేషన్లో వస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాలో అవకాశం అందుకుంది. ఇందులో రిద్ధి కుమార్ (Riddhi Kumar), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తో పాటు మాళవిక కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం. అలాగే కోలీవుడ్లో కార్తీ నటిస్తున్న ‘ సర్దార్ 2’ సినిమాలో కూడా ఈమె నటిస్తోంది.
ALSO READ: Pawan Kalyan HHVM : పవన్ మూవీకి బ్యాడ్ సెంటిమెంట్… వీరమల్లుకు దెబ్బ పడటం ఖాయమేనా ?