The 100 Trailer: కొన్ని సినిమాలే కాదు కొన్ని సీరియల్స్ ను కూడా ప్రేక్షకుల మనస్సులో ఎప్పుడు పదిలంగా ఉంటాయి. అలాంటి సీరియల్స్ లో మొగలి రేకులు ఒకటి. మంజూల నాయుడు తెరకెక్కించిన ఈ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్ర ప్రేక్షకులను ఎంత మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసాఫీసర్ ఆర్కే నాయుడుగా, అతని కొడుకు మున్నాగా సాగర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కేవలం ఫిదా మాత్రమే కాదు. ఆయన పేరు ముందే ఆర్కే అని పెట్టుకొనేలా చేశారు. ఆర్కే సాగర్ గానే అందరికీ సుపరిచితుడుగా మారాడు సాగర్. ఇక మొగలిరేకులు లాంటి భారీ హిట్ సీరియల్ తరువాత సాగర్ ఇంకో సీరియల్ లో కనిపించలేదు.
మొగలిరేకులు తరువాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో షాదీ ముబారక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మధ్యలో సినిమాలు చేయడం మానేసిన సాగర్ జనసేనలో చేరి ప్రచారంలో కూడా కనిపించాడు. ఇక ఆర్కే సాగర్ ఇప్పుడు ది 100 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సాగర్ సరసన మిషా నారంగ్ నటించింది.
ఇప్పటికే ది 100 నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టీజర్ ను మెగాబ్రదర్స్ తల్లి అంజనమ్మ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. మొగలిరేకులు ఆర్కే నాయుడుకు అంజనమ్మ పెద్ద ఫ్యాన్. సాగర్ ను ఇంటికి పిలిపించుకొని మరీ ఆమె మాట్లాడేదట. ఆ ప్రేమతోనే ఆమె టీజర్ ను లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేయడం విశేషం. ట్రైలర్ చూసి సాగర్ ను చిత్ర బృందాన్ని పవన్ ప్రశంసించారు. సినిమా మంచి హిట్ అందుకోవాలని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.
ది 100 ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేము, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపగలం అనే బేస్ వాయిస్ తో ట్రైలర్ మొదలయ్యింది. విక్రాంత్ ఐపీఎస్ ఒక నిజాయితీగల ఆఫీసర్. డ్యూటీలో గన్ వాడకుండా ఉండాలని నియమం పెట్టుకుంటాడు. ఆత్మరక్షణ కోసం తనను తాను ఆయుధంగా మార్చుకుంటాడు. అలా ఉన్న సమయంలో ఊరి చివర దొంగతనాలు చేస్తూ జనాలను చంపుతున్న ఒక ముఠాను పట్టుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత ఆ కేసు వలన అతనిపై ఆరోపణలు వస్తాయి. వాటి నుంచి బయటపడడానికి విక్రాంత్ ఏం చేశాడు.. ? ఆయుధాన్ని పట్టుకొను అని పెట్టుకున్న నియమాన్ని అతనే ఎందుకు బ్రేక్ చేస్తాడు. చివరకు ఆ ముఠాను విక్రాంత్ పట్టుకున్నాడా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పోలీస్ లుక్ లో సాగర్ అదిరిపోయాడు. సీరియల్ లో కూడా ఇదే లుక్ లో కనిపించాడు కాబట్టి ఆ ఫీల్ నే వస్తుంది. ఇందులో మరింత ఫిట్ గా, అద్భుతంగా కనిపించాడు. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ పవర్ ఫుల్ సంగీతం యాక్షన్ ని మరింత ఎలివేట్ చేసింది. జూలై 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఆర్కే సాగర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.