Peddi Controversy: రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రెండు వందల కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులకి శ్రీకారం చుట్టింది.
రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే సినిమా ఒకవైపు వసూళ్ళ వర్షంలో తడిసిముద్దవుతూనే మరోవైపు కాంట్రవర్సీలకి కేరాఫ్ అవుతుంది.ఇప్పటికే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్ర చుట్టూ సోషల్ మీడియాలో ఒక పెద్ద వివాదం చెలరేగింది. దర్శకుడు బుచ్చిబాబు సానా హీరోయిన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానంపై నెట్టింట భిన్నమైన చర్చ నడుస్తోంది. అచ్చియమ్మ పాత్రను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే, ఊహించని విధంగా సోషల్ మీడియాలో కొన్ని ప్రైవేట్ చాట్ స్క్రీన్‌షాట్లు వైరల్‌గా మారడం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో హీరోయిన్ పాత్రకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఒక సోషల్ మీడియా పోస్టుకు స్వయంగా జాన్వీ కపూర్ లైక్ చేసినట్లు ఆ స్క్రీన్‌షాట్లలో చూపించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
కొందరు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, కొత్త హీరోయిన్లు సైతం జాన్వీకి సపోర్టుగా నిలవడం గమనార్హం. అయితే ఈ రచ్చ ఇక్కడితో ఆగకుండా దర్శకుడి టేకింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేసే స్థాయికి వెళ్ళింది. షూటింగ్ సమయంలో కొన్ని కెమెరా యాంగిల్స్ విషయంలో జాన్వీ కపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆ సమయంలో హీరో రామ్ చరణ్ ఆమెకు అండగా నిలిచారని ప్రచారం జరుగుతున్న చాట్‌ల సారాంశం.
నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ మెసేజ్‌ల ప్రకారం.. సినిమాలో తన చెస్ట్, నడుము, మిడ్‌రిఫ్ భాగాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా కెమెరా యాంగిల్స్ పెట్టడంపై జాన్వీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఉంది. తనకు ఇష్టం లేని షాట్స్ వద్దని ఆమె ముందే చెప్పినప్పటికీ మేకర్స్ వినలేదనే అర్థం వచ్చేలా ఆ చాట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే హీరో రామ్ చరణ్ జోక్యం చేసుకుని, హీరోయిన్‌ను అలా చూపించవద్దని దర్శకుడికి గట్టిగా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. రామ్ చరణ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ పర్సన్ అంటూ జాన్వీ కొనియాడినట్లు కూడా అందులో రాసి ఉంది. సినిమా ఇండస్ట్రీలో మహిళల కంఫర్ట్ జోన్ కి అన్నింటి కన్నాఇంపార్టెన్స్ ఇవ్వాలని, కొందరు పాత ఆలోచనలతోనే సినిమాలను తీస్తున్నారంటూ ఆ స్క్రీన్‌షాట్లలో పెద్ద చర్చే నడిచింది.
Fake screenshots.
Please stop spreading edited chats and misinformation.#PEDDI#Janhvikapoor pic.twitter.com/H50UytSvuz
— Jahnavi Kapoor (@JanhvikapoorFC_) June 7, 2026
ఈ ప్రైవేట్ చాట్లు కాస్తా వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ సర్క్యులేట్ అవడంతో జాన్వీ కపూర్ టీమ్ మరియు ఆమె అధికారిక ఫ్యాన్ పేజీలు రంగంలోకి దిగాయి. ఈ వివాదంపై స్పందిస్తూ అవన్నీ పూర్తిగా ఎడిట్ చేసిన నకిలీ స్క్రీన్‌షాట్లని కొట్టిపారేశాయి. కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, నెగెటివిటీని పెంచడానికి కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టించారని తీవ్రంగా ఖండించాయి. సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం నిజంగా బాధాకరమని, అభిమానులు ఎవరూ వీటిని నమ్మవద్దని స్పష్టం చేశాయి.
తాజాగా హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం ఈ వ్యవహారంపై పరోక్షంగా స్పందిస్తూ, తన పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేయడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ వివాదాస్పద స్క్రీన్‌షాట్లు కేవలం మార్ఫింగ్ చేసినవేనని తేలిపోయింది. సినిమా సక్సెస్‌ను దెబ్బతీయడానికే కొందరు పనిగట్టుకుని ఈ దుష్ప్రచారానికి తెరలేపారని మెగా అభిమానులు మండిపడుతున్నారు.చూడాలి మరి ఇప్పుడిప్పుడే మొదలైన ఈ రగడ పెద్ది పై ఎలాంటి ఎఫెక్ట్ చూపెడుతుందో !
also read :మెగా ఇంట ‘పెద్ది’ సెలబ్రేషన్స్..హోరెత్తిపోయిన చరణ్ హోమ్ స్టాఫ్ మాస్ స్టెప్పులు.. క్లీంకార వాయిస్ ఓవర్ కేక!