Akkineni Sumanth:‘అనగనగా’ వంటి విజయం తర్వాత హీరో సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. ఈటీవీ విన్ నిర్మాణంలో రాజేష్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 31న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మూవీ ప్రమోషన్లలో సుమంత్ పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో తన సినిమా విశేషాలతో పాటు అక్కినేని యంగ్ హీరో అఖిల్ సాధించిన సక్సెస్ పై, నాగార్జున పడిన ఎమోషన్ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యంగ్ హీరో అఖిల్(akkineni akhil) ఇటీవల సాధించిన ఘన విజయంపై సుమంత్ ఆనందం వ్యక్తం చేశారు. అక్కినేని కాంపౌండ్‌లోని హీరోలంతా మంచి హిట్లతో బిజీగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక అఖిల్ నుంచి ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, ఈ విజయంతో తమ నిరీక్షణ ఫలించిందని చెప్పారు. అఖిల్ విజయం మొత్తం కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని సుమంత్ తెలిపారు.
అఖిల్ సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున రియాక్షన్ గురించి సుమంత్ ప్రత్యేకంగా మాట్లాడారు. నాగార్జున గారు స్టేజ్‌పై ఆ ట్రోఫీ పట్టుకుని వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంతో గెంతులు వేయడం, కళ్లల్లో నీళ్లు తిరగడం చూసి తామంతా ఎమోషనల్ అయ్యామని చెప్పారు. నాగార్జున గారు గతంలో తాతగారి (ఏఎన్నార్) విషయంలో కొన్నిసార్లు పబ్లిక్‌లో ఎమోషనల్ అయ్యారని, కానీ ఒక తండ్రిగా కొడుకు సాధించిన ఈ గ్రాండ్ సక్సెస్ ఆయనలో ఇంతటి ఆనందాన్ని, ఎమోషన్‌ను బయటకు తీసిందని పేర్కొన్నారు.
also read:ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లంటే?
టాలెంటెడ్ అఖిల్‌కు సరైన బ్లాక్‌బస్టర్ పడటానికి కాస్త సమయం పట్టిందనే మాటపై సుమంత్ స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ ఒక టైమ్ ఉంటుంది. ఇక నేను 1999లో కెరీర్ ప్రారంభించినా, నా మొదటి బ్లాక్‌బస్టర్ పడటానికి నాలుగేళ్లు (2003 వరకు) పట్టింది. అఖిల్‌కు కాస్త ఎక్కువ సమయమే పట్టినా, మధ్యలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి మంచి హిట్స్ వచ్చాయి. ఇప్పుడు వచ్చిన ఈ సక్సెస్ అతనికి ఎంతో ప్రత్యేకం” అని సుమంత్ చెప్పుకొచ్చారు.
మరోవైపు సుమంత్ నటించిన ‘న్యూటన్స్ థర్డ్ లా’ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగపతిబాబు, కార్తీక్ రత్నం, రవివర్మ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ థ్రిల్లర్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక ప్రచార చిత్రాలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాతో సుమంత్ కూడా తన ఖాతాలో మరో సాలిడ్ హిట్ వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వ్యక్తిగతంగా ఎంతో కష్టపడే తత్వం ఉన్న అఖిల్‌కు ఈ సక్సెస్ దక్కడం పట్ల అక్కినేని అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. నాగార్జున ఆనందం, సుమంత్ మద్దతు అక్కినేని కుటుంబంలోని అనుబంధానికి నిదర్శనంగా నిలిచాయి. ఇక రాబోయే ‘న్యూటన్స్ థర్డ్ లా’తో సుమంత్ కూడా థియేటర్లలో సంచలనం సృష్టించాలని, అక్కినేని హీరోల విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఇకపోతే దీంతోపాటు సుమంత్ మహేంద్రగిరి వారాహి అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.