Tollywood: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులు ఎలా అయితే నటన రంగంలో దూసుకుపోతున్నారో.. ఇప్పుడు వీరి బాటలోనే ఏకంగా సినిమాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు యువకులు. అలా చిన్న వయసులోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ నిర్మాతగా పేరు సొంతం చేసుకున్నారు రాఘవేంద్ర పూజారి. అలాంటి ఈయన తాజాగా నిర్మించిన చిత్రం లూసీ. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. మైండ్ బ్లోయింగ్ సైకాలజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్, థ్రిల్, ఊహకందని మలుపులతో అలరించనుంది అని చిత్ర బృందం స్పష్టం చేసింది. సైన్మా స్టూడియోస్ బ్యానర్ పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అండాలమ్మ పిక్చర్స్ సమర్పిస్తోంది.
ప్రస్తుతం ఎన్ఐటి వరంగల్లులో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర పూజారి.. టాలీవుడ్ లోనే అత్యంత చిన్న వయసులో నిర్మాతగా మారి రికార్డ్ సృష్టించారు. ఒకవైపు చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు సినీ నిర్మాణ రంగంలో నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలనే లక్ష్యంతో వరుస సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. అలా యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ.. విద్యతో పాటు సినీ నిర్మాణాన్ని కూడా సమతూకంగా కొనసాగించాలని ఆయన సంకల్పించారు. అందులో భాగంగానే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ALSO READ:బన్నీ, రామ్ చరణ్, నా తర్వాత ఆ అదృష్టం అందుకున్న ఏకైక హీరో అతనే.. మహేష్ బాబు స్పెషల్ వీడియో!
మహదేవ్ చిరంజీవి కథ, దర్శకత్వం వహించగా.. కిరణ్ పట్టేటి , ఆశిష్ పసుల ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చరణ్ రాజ్, శశాంక్ బాలు, ప్రశాంతి ఏడే, బల్వీర్ సింగ్, రంజిత్ నగెళ్లి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సాంకేతిక విభాగంలో ఎం సి సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా .. వియాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగేష్ అడపా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, ట్రైలర్, విడుదల తేదీకి సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. సైకాలజికల్ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే ప్రేక్షకులకు లూసీ సినిమా కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.