Film industry:గత కొన్ని రోజులుగా సినీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. అటు తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ 30% వేతన పెంపు డిమాండ్ తో సమ్మె ప్రకటించడంతో నిర్మాతలు ఈ సమస్యపై చర్చించేందుకు పలువురు సినీ తారలను కూడా కలుస్తున్నారు. వాస్తవానికి తెలుగు ఫిలిం ఫెడరేషన్ 2022లో చివరిసారిగా వేతనాలు సవరించిన తర్వాత మూడేళ్ల వ్యవధిలోనే 30% వేతన పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలి అని ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. కానీ సినీ పరిశ్రమ ప్రస్తుతం ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో.. నిర్మాతల గిల్డ్ ఈ పెంపును అంగీకరించడానికి సముఖంగా లేరు.
పెరుగుతున్న నిరసనలు..
ఇలాంటి సమయంలో తెలుగు ఫిలిం ఫెడరేషన్ మాత్రం తమ సభ్యులు వేతన పెంపును అంగీకరించిన నిర్మాతల షూటింగ్లకు మాత్రమే హాజరవుతామని నిర్ణయించడంతో నిర్మాతలు.. యూనియన్లతో సంబంధం లేని కార్మికులను నియమించుకోవడానికి ఆక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ద్వారా వెబ్సైట్ ను కూడా ప్రారంభించారు. ఇందులో భారీ సంఖ్యలో దరఖాస్తులతో ఈ వెబ్సైట్ కూడా క్రాష్ అయినట్లు కూడా తెలుస్తోంది. అలా ప్రస్తుతం జీతాలు పెంచాలి అని సినీ కార్మికులు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెంచలేమని నిర్మాతలు..ఇలా ఇద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఇంతలోనే ప్రముఖ నిర్మాత నోరు జారిన మాటలు కార్మికుల ఆగ్రహానికి మరింత దారితీసాయని చెప్పవచ్చు.
నోరు జారిన నిర్మాత..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ..”సినీ కార్మికులకు స్కిల్ లేదు”అంటూ ఆయన చెప్పడం వల్లే.. ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన సినీ కార్మికులు.. కృష్ణానగర్ మంగా టిఫిన్ సెంటర్ దగ్గర దాదాపు 200 మంది సినీ కార్మికులు ఆందోళనకు దిగారు.దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తతగా మారింది.
నిర్మాత మాటలపై మండిపడుతున్న కార్మికులు..
సినీ కార్మికులు మీడియాతో మాట్లాడుతూ.. “గత 30 – 40 సంవత్సరాల నుంచి సినీ కార్మికులుగానే ఇండస్ట్రీలో పనిచేస్తున్నాము. అప్పుడు జీతాలు పెంచేటప్పుడు కూడా స్కిల్ లేదనే కామెంట్లు చేశారు..ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న మాకు స్కిల్ లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ” అంటూ సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు నిర్మాత చేసిన కామెంట్లు సినీ కార్మికుల ఆందోళనలకు దారితీస్తున్నాయి. మరి ఈ వివాదం ఇంకా ఎంతవరకు వెళ్తుందో అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా నిర్మాతల కష్టాన్ని సినీ కార్మికులు.. సినీ కార్మికుల కష్టాన్ని నిర్మాతలు అర్థం చేసుకోవాలి అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ సమ్మె కారణంగా ఇండస్ట్రీకి వచ్చే లాభం ఏమీ లేదు అని..సినిమాలు తీయకపోతే మరింత నష్టాల్లోకి కూరుకుపోతారు అని పలువురు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ సమ్మె నిరసనలు ఆగిపోతాయేమో చూడాలి.