Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ కార్మికులు జీతాలను పెంచాలంటూ గత కొద్ది రోజులుగా స్ట్రైక్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ విషయంపై టాలీవుడ్ సినీ పెద్దలకు సినీ కార్మికుల మధ్య అనేక చర్చలు జరిగాయి. అయితే ఈరోజుతో ఈ సమస్యకు ఎండ్ పలకబోతున్నారు. మొత్తానికి కార్మికుల కోరిక మేరకు జీతాలను పెంపుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాళ్ల అడిగినట్లుగానే జీతాలను పెంచిన నిర్మాతలు కొన్ని కండిషన్లను కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఆ కండిషన్లను తప్పక పాటించాలని నిర్మాతలు ఆదేశించినట్లు సమాచారం. ఇంతకీ ఆ కండిషన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
సినీ కార్మికుల వేతనాలకు గ్రీన్ సిగ్నల్..
సినీపరిశ్రమలో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. 30 శాతం వేతనాలు పెంచేవరకూ తగ్గేదేలే అంటున్నారు కార్మికులు. ఇది ఈ విషయంపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని పలువురు చర్చలు జరిపారు. మొత్తానికి నేటితో ఈ సమస్య కొలిక్కి వచ్చేసింది. కార్మికులు డిమాండ్ మేరకు జీతాలను పెంచేందుకు నిర్మాతలు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. అయితే నిర్మాతలు వాళ్ళకు ఈ కండిషన్ లు కూడా పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు పెట్టిన కండిషన్లను ధిక్కరించకుండా ఫాలో అవ్వాలని ఆదేశించారు.
నిర్మాతల కండీషన్లు ఇవే..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత రెండు వారాలకు పైగా నిర్మాతలు మరియు కార్మికుల మధ్య చర్చలను జరుపుతోంది. నిర్మాతలు కార్మికుల ద్వారా అమలు చేయవలసిన నాలుగు వర్కింగ్ కండిషన్స్ ని కోరారు. ఈ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి..
* ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌ను 12 రెగ్యులర్ గంటల కాల్ షీట్‌గా పరిగణించవలెను.
* రెండవ ఆదివారం మరియు లేబర్ డిపార్ట్మెంట్ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించబడుతుంది.
* 01-07-2022 ఒప్పందం ప్రకారం, ఫైటర్స్ మరియు డాన్సర్స్ కోసం రేషియోలను 01-09-2023 నుండి వారు అమలు చేయడం లేదు. ఇది ఖచ్చితంగా అమలు చేయవలెను.
*01-07-2022 ఒప్పందంలోని జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 అమలు, అనగా నిర్మాతకు తన ఇష్టం ప్రకారం ఏ నైపుణ్యంలోనైనా ఏ వ్యక్తినైనా నియమించుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉంటుంది.
పైన పేర్కొన్న వర్కింగ్ కండిషన్స్ లను షరతులు లేకుండా అంగీకరించడంపై ఆధారపడి, రోజుకు రూ.2000 మరియు అంతకంటే తక్కువ సంపాదించే కార్మికుల వేతనాలను నిర్మాతలు వెంటనే 10% పెంచడానికి, రెండవ సంవత్సరం నుండి అదనంగా 5%, మరియు మూడవ సంవత్సరం నుండి మరో 5% పెంచడానికి ప్రతిపాదించారు.
రోజుకు రూ.2000 కంటే ఎక్కువ మరియు రూ.5000 కంటే తక్కువ సంపాదించే కార్మికులకు వచ్చే వరుసగా మూడు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 5% వేతన పెంపు ప్రతిపాదించబడింది.
అలాగే చిన్న బడ్జెట్ చిత్రాలకు వేతనాలు ప్రస్తుతం చెల్లిస్తున్న విధంగానే ఉంటాయి, ఎటువంటి పెంపు ఉండదు. ‘చిన్న బడ్జెట్’ అనే దాని బడ్జెట్‌లు మరియు విధానాలను ఛాంబర్ తగిన చర్చల తర్వాత నిర్ణయిస్తుంది.పైన పేర్కొన్న వేతనాలు నాలుగు వర్కింగ్ కండిషన్స్ అమలుకు లోబడి వర్తిస్తాయి.ఇవి లేబర్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణలో అధికారికంగా రూపొందించబడతాయి.. ఇవి తప్పకుండ ఫాలో అవ్వాలని సూచించారు..