వెలుగుల పండుగ దీపావళి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దేశ వ్యాప్తంగా దీపావళి రోజు ప్రతి ఇంటి ముంగిట దీపాలు దేదీప్యమానంగా వెలుగుతుంటాయి. టపాసులు కాల్చుతూ ఇంటిల్లిపాది ఈ వేడుకలను జరపుకుంటారు. పిండి వంటలు, స్వీట్లు తినిపించుకుంటూ జాలీగా గడుపుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుక నిర్వహించుకుంటారు. చీకటిపై వెలుగు ఆధిపత్యాన్నిఈ పండుగ సూచిస్తుంది. అయితే, దీపావళి పండుగను దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విభిన్న పేర్లతో పిలుస్తారు. ఈ స్టోరీలో దీపావళిని ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారు? ఎలా జరుపుకుంటారు? అనేది వివరంగా తెలుసుకుందాం..
ఉత్తరాది రాష్ట్రాలు అయిన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ లో ఈ పండుగను దీపావళి లేదంటే దివాళీ అని పిలుస్తారు. ఈ పండుగ శ్రీ రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ సందర్భాగాన్ని సూచిస్తుంది. ఆయన రాకకు గుర్తుగా ఇళ్లలో దీపాలు వెలిగించడం, ముగ్గులు వేయడం, పిండి వంటకాలు చేసుకోవడం, బాణాసంచా కాల్చడంతో పాటు లక్ష్మీదేవి పూజించడం ఆచారంగా కొనసాగుతోంది.
తమిళనాడులో దీపావళిని అదే పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగను రాక్షసుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. దీపావళి రోజు తెల్లవారుజామునే గంగా స్నానం చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. ఇంట్లో దీపాలు వెలిగించడం, రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవడంతో పాటు పటాలసులు కాల్చి ఎంజాయ్ చేస్తారు.
కర్నాటకలోనూ దీపాల పండుగను దీపావళి పేరుతో జరుపుకుంటారు. కన్నడ ప్రజలు నరకాసుర వధ సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఇళ్లను దీపాలతో అలంకరించడం, రంగవల్లులు వేయడం, స్వీట్లు పంచడం, పటాసులు కాల్చడం చేస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీ పూజ చేస్తారు.
తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దీపావళిని ప్రజలు ఘనంగా జరపుకుంటారు. ఈ పండుగను నరకాసుర వధ సందర్భంగా జరుపుకుంటారు. ఇళ్లను దీపాలు వెలిగించడం, రంగోలీలు వేయడంతో పాటు స్వీట్లు, పిండి వంటలు తయారు చేసుకుంటారు. లక్ష్మీ పూజ చేసి పటాసులు కాల్చుతారు. వ్యాపారాలు చేసే వ్యక్తులు కొత్త లెక్కల పుస్తకాను ప్రారంభిస్తారు.
మహారాష్ట్రలో దీపావళిని దివాళీ అని పిలుస్తారు. ఐదు రోజుల పాటు ఈ పండుగను జరపుకుంటారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, లక్ష్మీ పూజ, బలి పాడ్యమి, భాయ్ దూజ్ గా వేడుకలు చేస్తారు. ఈ సమయంలో ఇళ్లను దీపాలు, ముగ్గులతో అలంకరిస్తారు. స్వీట్లు, బహుమతులు పంచుకుంటారు. గుజరాత్ లోనూ ఈ పండుగను దివాళీ అనిపిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవి పూజ నిర్వహిస్తారు. ఈ పండుగ వ్యాపారవేత్తలు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా భావిస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీ-గణపతి పూజను ఘనంగా నిర్వహిస్తారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లో దీపావళి రోజున కాళీ పూజ నిర్వహిస్తారు. కాళీదేవిని పూజించి, దీపాలు వెలిగిస్తారు. దీపాలను ఆలంకరిస్తారు. స్వీట్లు తయారు చేస్తారు. పటాసులు కాల్చుతారు.
జమ్మూ, కాశ్మీర్ లో దీపావళిని దివాళీగా జరుపుకుంటారు. ఈ పండుగను దీపాలు వెలిగించి, లక్ష్మీదేవి పూజ నిర్వహించి, స్వీట్లు పంచుకుంటారు.
Read Also: దీపావళికి వైజాగ్ వెళ్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్!