Pak Tri-series: పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రంగంలోకి జింబాబ్వే క్రికెట్ టీం దిగింది. ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆఫ్గనిస్తాన్ తాజాగా ప్రకటన చేయగా… ఆ స్థానంలోకి మరో జట్టు వచ్చేస్తోంది. పాకిస్తాన్, శ్రీలంక అలాగే ఆఫ్ఘనిస్తాన్ మూడు జట్ల మధ్య టి20 ట్రై సిరీస్ నవంబర్ లో జరగాల్సి ఉంది. అయితే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును భర్తీ చేసేందుకు జింబాబ్వే రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ ట్రై సిరీస్ కు ఆఫ్గనిస్తాన్ దూరమవుతున్న సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి జరిగిన బాంబుదాడిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ముగ్గురు ప్లేయర్లు మృతి చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో వెంటనే స్పందించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇకపై పాకిస్తాన్ తో ఎలాంటి ట్రోఫీలు ఆడబోమని వెల్లడించింది. ఇందులో భాగంగానే నవంబర్ మాసంలో జరగబోయే ట్రై సిరీస్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 100 కోట్ల నష్టం జరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ప్రకటనతో కుదేలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు జింబాబ్వే బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఆఫ్ఘనిస్తాన్ స్థానంలో తమ జట్టు ట్రై సిరీస్ ఆడుతుందని జింబాబ్వే దేశ బోర్డు వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సిరీస్ ఆడితే తమ బోర్డుకు కూడా లాభం జరుగుతుందని జింబాబ్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఆఫ్గనిస్తాన్ స్థానంలో జింబాబ్వే ఆడితే కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటించే ఛాన్సులు ఉన్నాయి.
నిన్న అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ పౌరులపైన వైమానిక దాడికి పాల్పడింది పాకిస్తాన్. ఈ బాంబు దాడిలో ఏకంగా 8 మంది మరణించారు. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు సంబంధించిన ముగ్గురు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆ ముగ్గురు క్రికెటర్లు మరణించిన నేపథ్యంలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ సంఘటనపై ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించారు. జనావాసాల పై పాక్ చేసిన వైమానిక దాడిని ఖండించాడు. ఈ అనాగరిక అలాగే ఆటవిక చర్యలో మహిళలు పిల్లలు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ క్రికెటర్లు మరణించారని ఎమోషనల్ అయ్యారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని వెల్లడించారు. ట్రై సిరీస్ నుంచి వైదొలగాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు రషీద్ ఖాన్.