Soundarya Birth anniversary: సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎంతోమంది తారలు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు. కొంతమంది అయితే మరణించి దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు అంటే.. వారిని అభిమానులు ఎంతలా ఆరాధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యాలలో అలనాటి నటీమణి సావిత్రి (Savitri) తర్వాత అంతటి పేరు సొంతం చేసుకుంది సౌందర్య (Soundarya) మాత్రమే. కట్టు బొట్టు సాంప్రదాయంగా కనిపిస్తూ గ్లామర్ ప్రపంచంలో కూడా పద్ధతిగా పాత్రలు చేసి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. ఈమె మరణించి 22 ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈరోజు సౌందర్య జయంతి. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సౌందర్య బాల్యం, విద్యాభ్యాసం..
సౌందర్య అసలు పేరు సౌమ్య. 1972 జూలై 18న కర్ణాటక రాష్ట్రం.. కోలారు జిల్లా.. ముళభాగళ్ లో జన్మించింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును సౌందర్యగా మార్చుకుంది. ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మొదటి సినిమాలో నటించింది. ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా.. ఈమె తండ్రి స్నేహితుడు ‘గంధర్వ’ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఆ తర్వాత తెలుగు రంగ ప్రవేశం చేసింది. ఈమె తెలుగులో చేసిన మొదటి చిత్రం ‘రైతు భారతం’. కృష్ణ (Krishna) మరదలిగా భానుచందర్ (Bhanu chandar) సరసన నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే ‘మనవరాలి పెళ్లి’ సినిమాలో కూడా నటించే అవకాశం రావడంతో.. రైతు భారతం సినిమా నిర్మాణంలో జాప్యం ఏర్పడడం వల్ల మనవరాలి పెళ్లి సినిమా మొదట విడుదలైంది. ఈ సినిమాతో తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించిన ఈమె.. ఆ తర్వాత తీసిన ‘అమ్మోరు’ సినిమా విజయవంతం అవడంతో.. చదువును మధ్యలోనే ఆపేసింది సౌందర్య
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన సౌందర్య..
ఆ తర్వాత కన్నడ, తమిళ్, మలయాళం చిత్రాలతో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది. హిందీలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తో కలిసి ‘సూర్యవంశ్’ అనే సినిమాలో నటించింది. ఇక తెలుగులో ఎక్కువగా వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది సౌందర్య. వెంకటేష్ (Venkatesh)తో రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, దేవీపుత్రుడు ఇలా పలు చిత్రాలలో నటించి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ గా పేరు సొంతం చేసుకుంది.
సౌందర్య అందుకున్న అవార్డులు..
12 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. కర్ణాటక ప్రభుత్వం నుండి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడు నంది అవార్డులు అందుకున్న ఈమె.. లైట్ బాయ్ ని మొదలుకొని ప్రతి ఒక్కరిని ఆదుకునే గొప్ప మనిషిగా పేరు సొంతం చేసుకుంది.
జూనియర్ సావిత్రి గా గుర్తింపు..
ఇకపోతే ఇతరులకు సహాయం చేయడంలోనూ.. అలాగే తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలోనూ మహానటి సావిత్రికి తగ్గట్టుగా ఉండడంతో.. తెలుగు సినీ పరిశ్రమలో ఆ అందరూ జూనియర్ సావిత్రి అని పిలిచేవారు. అంతేకాదు సౌందర్యకు ‘నవరస నటన మయూరి’ అనే బిరుదును కూడా అందించారు.
చనిపోయి 22 ఏళ్ల అయినా తగ్గని క్రేజ్..
సినీ ఇండస్ట్రీలో కెరియర్ పీక్స్ లో ఉండగానే 2004 ఏప్రిల్ 17న భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో.. విమాన ప్రమాదం చోటుచేసుకుని అక్కడికక్కడే మరణించింది. ఆ ప్రమాదంలో కన్నడ చిత్ర నిర్మాత , సౌందర్య సోదరుడు అమర్నాథ్ కూడా మరణించారు. అలా ఈమె చనిపోయి 22 ఏళ్ళు అవుతున్న ఇంకా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు.
సౌందర్య స్మారక పురస్కారం..
సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను సౌందర్య పేరు పైన ఆమె జ్ఞాపకార్థం ‘సౌందర్య స్మారక పురస్కారాన్ని’ కర్ణాటకాంధ్ర లలిత కళ అకాడమీ వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటన కనబరిచిన నటీనటులకు ఈ పురస్కారాన్ని బహుకరిస్తున్నారు.
ALSO READ:Jabardast Pavitra: స్టేజ్ పై జబర్దస్త్ పవిత్రకు లవ్ ప్రపోజల్.. ఇంకెన్ని చేస్తారంటూ నెటిజన్స్ ఫైర్!