Ayodhya: పవిత్ర నగరమైన అయోధ్య దీపావళి పండుగ సందర్భంగా చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టానికి వేదికైంది. దీపావళి పండుగను పురస్కరించుకుని జరిగిన మెగా దీపోత్సవం కార్యక్రమం రెండు ప్రతిష్టాత్మక గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించి, అయోధ్య కీర్తిని దశదిశలా వ్యాపింపజేసింది. శ్రీరాముడు కొలువైన ఈ దివ్య క్షేత్రంలో.. సరయూ నది ఒడ్డున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఒడిశా పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో దీపోత్సవం అత్యంత వైభోగంగా జరిగింది. భక్తుల పారవశ్యం, ప్రభుత్వ కృషితో ఈసారి దీపోత్సవం మునుపెన్నడూ చూడని విధంగా కన్నులపండువగా నిర్వహించారు.
ఈ మహత్తర ఘట్టంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి, ఏకంగా 26,17,215 దీపాలను వెలిగించారు. ఇంత భారీ మొత్తంలో దివ్వెలను వెలిగించడం ఒక ప్రపంచ రికార్డుగా నమోదైంది. సరయూ నదీ తీరం లక్షలాది దీపాల కాంతులతో వెలుగుల తోరణంలా జిగేల్‌మంటూ భక్తులకు కనువిందు చేసింది. దీంతో పాటు, ఈ భారీ జనసందోహంతో హారతి కార్యక్రమం నిర్వహించడం కూడా మరో గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదైంది. భక్తులు అశేషంగా పాల్గొని, భక్తిపారవశ్యంతో చేసిన హారతి కార్యక్రమం గిన్నిస్ ప్రతినిధులను సైతం ఫిదా చేసింది.
ఈ మెగా దీపోత్సవ నిర్వహణను పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు, రెండు ప్రపంచ రికార్డుల నమోదుకు సంబంధించిన సర్టిఫికెట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేశారు. ఈ ఘనతపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేశారు. దీపోత్సవంలో భాగంగా రాముడు నిర్వాణం పొందినట్టుగా చరిత్ర చెప్పే రామ్ కీ పైడీ వద్ద ‘లేజర్ లైట్ షో’ను నిర్వహించారు. దీపాల వెలుగులకు లేజర్ కిరణాల జిలుగులు తోడవ్వడంతో ఆ ప్రాంతమంతా అద్భుత కాంతులతో మెరిసిపోయింది. సరయూ నది తీరం దాని పరిసర ప్రాంతాలు దివ్య కాంతులతో కళకళలాడాయి.
ALSO READ: Nizamabad News: రియాజ్‌ను ఎన్ కౌంటర్ చేయలేదు.. నిజామాబాద్ సీపీ కీలక ప్రకటన
అంతేకాదు, రాముడి జీవిత గాథను కళ్లకు కట్టే విధంగా నిర్వహించిన ‘రామ్‌లీలా’ నాటక ప్రదర్శన కూడా ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి గీతాలు, ఈ భారీ దీపాల వెలుగులతో అయోధ్య ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఈ దీపోత్సవం కేవలం రికార్డులకే పరిమితం కాకుండా, కోట్లాది మంది భక్తులకు చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చింది. అయోధ్య చరిత్రలో ఈ మెగా దీపోత్సవం ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది.
ALSO READ: JEE Main 2026 Schedule: జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?