Varalakshmi Story: ఎస్. వరలక్ష్మి..ఈ పేరు ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలీకపోవచ్చు,కానీ అలనాటి క్లాసిక్ సినిమాల్ని తరచుగా చూసేవారికి ఈవిడ బాగా పరిచయం. ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో నటిగానే కాకుండా, మంచి గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది, ఇక ఈవిడ వాయిస్ లో ఉన్న బేస్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగే ఉండేది. అలాంటి ఈ వరలక్ష్మి అక్కినేని వారిని ప్రేమించిదన్న విషయం మీకు తెలుసా.. ? ఆ ప్రేమ విఫలమయ్యాక మరో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత క్రమక్రమంగా ఆర్ధిక ఇబ్బందులని ఎదుర్కోవడం వంటి ఎత్తు పల్లాలు ఎన్నో ఆమె జీవితంలో ఎదురయ్యాయి.మరింతకీ ఆ ఎత్తు పల్లాలు ఏంటో డీటైల్డ్ గా చూసేద్దాం.
ఎస్. వరలక్ష్మి 1927లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోపుట్టింది. అయితే పుట్టడమే ఆమె సవాళ్ళ మధ్య పుట్టింది. తన తండ్రికి అమ్మాయిలూ అంటే ఇష్టం లేకపోవడంతో పెద్దమ్మ,రంగయ్య నాయుడుల సహకారంతో కర్నూల్ కి చేరడం ఆమె లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అక్కడ సంగీతం నేర్చుకుంటున్న వరలక్ష్మిని చూసి బాలయోగిని’ (1937) చిత్రంలో మంచి పాత్రని ఇచ్చారు ప్రముఖ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం.అలా కేవలం పదేళ్ళ వయసులోనే సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది.
‘కోయిలోకసారొచ్చి కూసిపోయింది’
ఇక ఆ తర్వాత ప్రముఖ కన్నడ సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి చిన్నప్పటి పాత్రని ‘సేవా సదనం’ (1938)లో పోషించి మంచి పేరే తెచ్చుకుంది. ఈ చిత్ర దర్శకుడు K. సుబ్రహ్మణ్యం వరలక్ష్మిని ఎంతగానో ప్రోత్సహించారు.ఆ తర్వాత వచ్చిన ‘రైతుబిడ్డ’, ‘ఇల్లాలు’ సినిమాల్లో చిన్న పాత్రలే చేసినా ‘ఇల్లాలు’లో ఆమె పాడిన “కోయిలోకసారొచ్చి కూసిపోయింది”అనే పాట ఒక సెన్సేషన్ అయిపొయింది.ఈ పాటే వరలక్ష్మి గొంతు లోని తీపిని ప్రపంచానికి పరిచయం చేసింది.
also read:వెండితెరపై బికినీతో సంచలనం.. చివరికి ఎయిడ్స్‌తో దర్గా బయట అనాథగా..
అయితే అప్పుడప్పుడే కెరీర్ గాడిలో పడుతున్న సమయంలో చేసిన ‘శాంత బాలనాగమ్మ’ (1942) అనే సినిమా ఆమెకి మరింత బూస్టప్ ఇచ్చింది .సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావుతో కలిసి ఈ సినిమాలో నటించడమే కాకుండా ఏకంగా మూడు పాటలు పాడటం విశేషం.ఇక వరలక్ష్మికి అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘మాయాలోకం’ (1945) సినిమానే.నిజానికి ఆ సినిమాలో హీరోయిన్ గా చేయాల్సింది కమలా కోట్నిస్. కానీ ఆ పాత్ర అనుకోకుండా వరలక్ష్మికి దక్కడం, ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఒక్కసారి టాప్ లీగ్ లోకి దూసుకొచ్చింది.
స్టార్ డమ్ ని తెచ్చిన సినిమా ‘పల్నాటి యుద్ధం
అయితే అలా వరుస సినిమాలు చేస్తున్నా ఆమెకి అసలు సిసలైన స్టార్ డమ్ ని తెచ్చిన సినిమా మాత్రం ‘పల్నాటి యుద్ధం’. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమాకి పాటల రికార్డింగ్ పూర్తి అయిన వెంటనే వాటిని మద్రాసు ఆలిండియా రేడియో వారు ప్రసారం చేయడం అప్పట్లో ఒక సెన్సేషన్. ఇక 1948లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన బాలరాజు సినిమా ఎంతటి పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. ఇక వరలక్ష్మి కెరీర్ లో వచ్చిన సినిమాల్లో ‘వెంకటేశ్వర మహాత్మ్యం’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘సత్య హరిశ్చంద్ర’ వంటి సినిమాలు ఆమె స్థానాన్ని మరింత పదిలం చేశాయి. ముఖ్యంగా భూదేవిగా‘లవకుశ’లో ఆమె చూపిన నటన ఇప్పటి తరానికి ఒక లెస్సన్ .
ఇక ‘వీరపాండ్య కట్టబొమ్మన్’ సినిమాలో శివాజీ గణేశన్‌తో వరలక్ష్మి నటిస్తూ పాడిన పాటలు అయితే అప్పట్లో ఒక సెన్సేషన్. ఈ సినిమాని కైరో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో స్క్రీనింగ్ చేసినప్పుడు వరలక్ష్మి గొంతుకు ఫిదా అయిపొయింది ఆడిటోరియం.అలా కేవలం నటిగానే కాదు కన్నాంబ స్పూర్తితో ‘వరలక్ష్మి పిక్చర్స్’ అనే బ్యానర్ పై ‘సతీ సావిత్రి’ (1957) అనే సినిమాని కూడా నిర్మించింది వరలక్ష్మి.ఈ సినిమాకి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎనిమిది మంది సంగీత దర్శకులు ఈ సినిమాకి సంగీతం అందించడం.
ఇక తన గాత్రంతో ఎంతో మందిని అలరించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణను వెండితెరకు పరిచయం చేసింది కూడా వరలక్ష్మినే కావడం విశేషం.
అక్కినేనిని ప్రేమించినప్పటికీ
ఇక క్రమక్రమంగా హీరోయిన్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిన వరలక్ష్మి ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘ముద్దుల కృష్ణయ్య’తో పాటు తమిళంలో K.బాలచందర్ తీసిన ‘బొమ్మ బొరుసా’, కమల్ హాసన్ ‘గుణ’ వంటి చిత్రాల్లోనూ తనదైన నటనతో మెప్పించింది.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వరలక్ష్మి నిజజీవితంలో ఎన్నో కష్టాలు పడింది.
బాలరాజు సినిమా తర్వాత వరలక్ష్మి అక్కినేనిని ప్రేమించినప్పటికీ ఆ ప్రేమ పెళ్లి పీటల దాకా వెళ్ళలేదు.ఇక అలా ఆ ప్రేమ విఫలమయ్యాక నిర్మాత ఎ.ఎల్. శ్రీనివాసన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఎ.ఎల్. శ్రీనివాసన్ ఎవరో కాదు ప్రముఖ కవి కణ్ణదాసన్ సోదరుడే.ఇక వరలక్ష్మి,శ్రీనివాసన్ దంపతులకి ఇద్దరు పిల్లలు పుట్టగా వారిలో ఒకరు మెంటల్లీ చాలెంజ్ కావడం ఆమెని చివరి వరకు వేదించింది. ఇక దీనికి తోడు సొంత ప్రొడక్షన్ లో చేసిన సినిమాలు అట్టర్ ప్లాపులు కావడం, అదే సమయంలో 1977లో భర్త శ్రీనివాసన్ చనిపోవడం ఆమె జీవితానికి పెద్ద నష్టాన్ని తీసుకొచ్చాయ్.
చివరికి దీనంగా చనిపోవడం బాధాకరం
ఇక వీటికి తోడు అత్తవారింట్లో ఎదురైన ఇబ్బందులతో పాటు ఆర్ధికంగా కుంగిపోవడం వంటివి ఆమెని ఒంటరి చేశాయి.ఇక ఒకప్పుడు ఎందరికో సహాయం చేసిన వరలక్ష్మి చివరి రోజుల్లో తోటి నటి గీతాంజలి వంటి వారి సహాయాన్ని అర్ధించాల్సిన పరిస్థితి.అయితే ఈమె పరిస్థితిని గమనించిన జెమినీ గణేషన్, గీతాంజలి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కి ఈ విషయాన్ని చేరవేయగా ఆమె చాలా బాధ పడిందట. ఎందుకంటే జయలలిత చిన్నతనంలో ఎక్కువగా వరలక్ష్మి ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేది.అలా చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూఆమె పేరిట ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ ఏర్పాటు చేసి ఆర్థిక భరోసా కల్పించిందట జయలలిత. అయితే చివరి రోజుల్లో ఆరు నెలల పాటు వెన్ను నొప్పితో మంచానికే అతుక్కుపోయిన వరలక్ష్మి చివరికి సెప్టెంబర్ 22, 2009 రాత్రి చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూసింది.జీవితంలో ఎంతో డబ్బుని చూసిన వరలక్ష్మి చివరికి దీనంగా చనిపోవడం బాధాకరం.